Atal Pension Yojana: సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అలాగే రైతులకు, మహిళలకు కూడా పలు రకాల స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం అందిస్తున్న పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరిన వారు ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. అసంఘటిత రంగంలోని వారి కోసం కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. పీఎఫ్ఆర్డీఏ ఈ పథకం నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది.
ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు చేరవచ్చు. అయితే ఇందులో ఎలా చేరాలి అని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కేవలం మీ ఆధార్ కార్డ్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సహా ఇతర ప్రాంతీయ బ్యాంకులు కూడా ఈ అటల పెన్షన్ యోజన అకౌంట్ ను ఓపెన్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పొందవచ్చు. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.210 చెల్లిస్తే.. రూ. 5 వేలు లభిస్తాయి. అంటే రోజుకు రూ.7 ఆదా చేస్తే సరిపోతుంది. అలాగే రూ.1000 కావాలంటే.. నెలకు రూ.42 కట్టాలన్న మాట. ఇదే కాకుండా.. నెలకు రూ.2000 పెన్షన్ తీసుకోవాలంటే రూ.84 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 3 వేల కోసం రూ. 126, రూ. 4 వేల కోసం రూ.168 కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి ప్రతి నెల ఈ డబ్బులు వస్తాయి. అయితే మీరు ఎంత మొత్తంలో పెన్షన్ తీసుకోవాలనే అంశం.. మీరు ప్రతి నెలా చెల్లించే డబ్బులపై ఆదారపడి ఉంటుంది.