
జాతీయ రహదారులపై టోల్ చెల్లించకుండా వెళ్లిపోతున్నారా..? అయితే ఇకపై జాగ్రత్త. ఇప్పటినుంచి అలా చేస్తే మీరు జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. టోల్ చెల్లింపు వ్యవస్థను సమర్థవంతగా అమలు చేయడం, పాదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ తాజాగా కొత్త రూల్స్ విడుదల చేసింది. టోల్ ఎగవేసేవారిని నిరోధించడం, టోల్ చెల్లింపును పటిష్టం చేయడంలో భాగంగా కొత్త గైడ్ లైన్స్‌ను రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ద్వారా టోల్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. టోల్ చెల్లించకుండా ఎగవేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.
టోల్ బకాయిలు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్,. ఫిట్‌నెస్, నేషనల్ పర్మిట్ వంటి సర్టిఫికేట్లు జారీ చేయడం నిలిపివేస్తారు. ఈ మేరకు ఇప్పటివరకు అమల్లో ఉన్న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 సవరిస్తూ కొత్త రూల్స్ 2026ను తాజాగా కేంద్రం జారీ చేసింది. జాతీయ రహదారులను మెరుగుపర్చడం, మరింత మెరుగ్గా నిర్వహించడం, టోల్ చెల్లింపుల్లో సాంకేతికను అమలు చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీకి ఈ కొత్త రూల్స్ ఉపయోగపడనున్నాయి. ఈ రూల్స్ ప్రకారం ఇకపై మీరు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వాహన యాజమాన్యాన్ని మార్చేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే టోల్ ఫీజులు మొత్తం చెల్లించాలి. ఇక టోల్ ఫీజు పెండింగ్‌లో ఉంటే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయరు. ఇలాంటి అనేక సేవలను పొందకుండా వాహనదారులను నిరోధించనున్నారు.
ఒక వెహికల్ ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ ద్వారా టోల్ ప్లాజాను దాటినప్పటికీ.. టోల్ ఛార్జీ అందకపోతే చెల్లించని వినియోగదారుడిగా పరిగణిస్తారు. దీంతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకునే సమమయంలో ఫారమ్ 28లో ఈ విషయాన్ని పేర్కొనాలి. టోల్ ఫీజు బకాయిలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌లో కూడా ఫారం 28లో సమర్పించడానికి వీలు కల్పించనున్నారు. త్వరలో టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా మల్టీ లేన్ ఫ్రీ టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. పలు హైవేలపై దీనిని పైలట్ ప్రాజెక్టు తరహాలోనే అమలు చేస్తోండగా.. త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. ఈ వ్యవస్థను సమర్థవంతగా అమలు చేయడంలో తాజా విడుదల చేసిన మార్గదర్శకాలు మొదటి దశగా చెబుతున్నారు. ఈ సవరణలను జులై 2025 విడుదల చేసి మసాయిదాలో పేర్కొనగా.. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఇప్పుడు తుది నోటిఫికేషన్ జారీ చేశారు.