Cyber Crime: సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి నో టెన్షన్.. రీఫండ్‌పై కేంద్రం కీలక అప్డేట్

దేశంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. అమాయకపు ప్రజలను బురిడీ కొట్టించి లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. ప్రజలు ఎంత అవగాహనతో ఉన్నా ఏదోక కొత్త పద్దతిలో మోసం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

Cyber Crime: సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి నో టెన్షన్.. రీఫండ్‌పై కేంద్రం కీలక అప్డేట్
Cyber Crime

Updated on: Jan 16, 2026 | 6:45 PM

దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలపై దేశంలోని ప్రజలందరూ ఫిర్యాదు చేసేందుకు కేంద్రం సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ఎప్పటినుంచో అందుబాటులోకి తెచ్చింది. అలాగే యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రజలకు త్వరతగిన సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సైబర్ నేర నివేదిక పోర్టల్‌లోని సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు తాజాగా ఆమోదం తెలిపింది.

ప్రజలకు రిలీఫ్

ఈ కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజల్ వల్ల సైబర్ నేరాల బారిన పడి డబ్బులు నష్టపోయినవారికి ఊరట లభించింది. రూ.50 వేల కంటే తక్కువ మొత్తంతో జరిగిన చిన్నస్థాయి సైబర్ మోసాలకు కోర్టు ఆదేశం లేకుండానే బాధితులకు రీఫండ్ వెంటనే అందించవచ్చు. కోర్టు లేదా రిస్టోరేషన్ ఆర్డర్ లేని సమయంలో బ్యాంకులు విధించిన హోల్డులను 90 రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది. దీని వల్ల బాధితులకు వెంటనే నిధులు అందుతాయి. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డేటా ప్రకారం.. గత ఆరేళ్లల్లో ప్రజలు రూ.52,976 కోట్లకు పైగా నష్టపోయారు. దీంతో కేంద్రం తీసుకున్న కొత్త ప్రొసీజర్ వల్ల బాధితులకు త్వరతగిన సహాయం అందుతుందని, వారితో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజమైన బ్యాంకు అకౌంట్లపై అనవసర ఫ్రీజ్‌లను తగ్గించడం, నిర్ధారిత మోసాలపై వేగవంతమైన చర్యలకు తాజాగా నిర్ణయాలు దోహదపడుతాయని అంతటున్నారు. అలాగే కొత్త రూల్స్ వల్ల బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాక్ ట్రేడింగ్ యాప్‌లతో పాటు మ్యూచువల్ ఫండ్ సంస్థలు సైబర్ నేరాలపై ప్రజలు ఫిర్యాదు నమోదైనప్పుడు అనుసరించాల్సిన పద్దతి, కాలపరిమితి ప్రక్రియ గురించి స్పష్టమైన స్పష్టత వచ్చిందన్నారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం

కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చూకూరనుంది. తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వినియోగం ఎక్కువగా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో సైబర్ మోసాల ఫిర్యాదులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ కొత్త నిర్ణయం త్వరగా సమస్య పరిష్కారం అవ్వడంతో పాటు వేగంగా నిధులు అందుతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు.

జియోటస్.కామ్  సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ మాట్లాడుతూ..“ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగం మొత్తానికి (ఎక్స్చేంజ్‌లు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ ఆసెట్ మధ్యవర్తులు సహా), SOPలో పేర్కొన్న ఏకరీతి ఫిర్యాదు పరిష్కార, నిధుల పునరుద్ధరణ వ్యవస్థ అనిశ్చితిని తగ్గించి, భాగస్వాముల బాధ్యతలను సమన్వయం చేసి, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మధ్యవర్తులు మరియు చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయంతో కూడిన ఎస్కలేషన్ నిర్మాణం, నిజమైన ఖాతాలపై అనవసర ఫ్రీజ్‌లను తగ్గించడంతో పాటు, నిర్ధారిత మోసాలపై వేగవంతమైన చర్యలకు దోహదపడుతుంది.” అని తెలిపారు.