Chitra ramakrishna: దేశంలోని దిగ్గజ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSEలో సంచలనం రేపిన కో-లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో మాజీ ఎండీ, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) అరెస్టు చేసింది. అనంతరం ఆమెను వైద్య పరీక్షలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉంచినట్లు వెల్లడించారు. చిత్రారామకృష్ణను వరుసగా మూడు రోజులు ఇంటరాగేషన్ చేసిన సీబీఐ.. విచారణలో ఆమె సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలోని సీనియర్ సైకాలజిస్ట్ కూడా చిత్రను ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. అప్పుడు కూడా ఆమె సరైన సమాధానం ఇవ్వకపోడంతోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దిల్లీలోనే చిత్రను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే చిత్ర ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆ అభ్యర్థనను కొట్టివేసింది. చిత్ర 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు వరకు ఎన్‌ఎస్‌ఈకి ఎండీ, సీఈఓ హోదాలో పనిచేశారు.
కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న అదృశ్య యోగి అనే అనుమానాలు ఉన్న ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ అధికారి (GOO), ఎండీ చిత్రా రామకృష్ణ సలహాదారు ఆనంద్ సుబ్రమణియన్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం అతన్ని విచారించనుంది.2018 మేలో ఎఫ్‌ఐఆర్ నమోదైన కో-లొకేషన్ కేసులో తాజాగా అరెస్టులు, విచారణ వేగంగా జరుగుతున్నాయి. స్టాక్ బ్రోకర్లకు ముందస్తుగా షేర్ల ధరలు తెలిసేలా కంప్యూటర్ సర్వర్లలో అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగంగా ఉంది. సెబీ చట్టంలోని సెక్షన్-24 కింద వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కో లొకేషన్ స్కామ్ లో ఎన్ఎస్ఈ డైరెక్టర్ స్థాయి అధికారికి తెలియకుండా జరిగే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఎకనామిక్ అఫెన్సెస్ లలో చాలా విషయాలు దాగి ఉంటాయని వాటి వల్ల ప్రజాధనానికి భారీగా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డ కోర్టు ఈ మేరకు చిత్రకు ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది. దీనికి తోడు ఆనంద్ సుబ్రమణియన్ నియామకంలో జరిగిన అవకతవకలపై సెబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండి..
Chitra Ramakrishna: చిత్రను నడిపిన అజ్ఞాత యోగి అతడే.. సాక్ష్యాలతో సిద్ధమైన సెబీ.. పూర్తి కథ మీకోసం..