భారత కార్ల కంపెనీలు ఫుల్ ఖుషీ..! పెళ్లిళ్ల సీజన్‌లో కార్ల విక్రయాల జోరు

|

Dec 02, 2024 | 5:11 PM

India Automobile Industry: పండుగల సీజన్ ముగిసినప్పటికీ భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జోష్ తగ్గలేదు. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మంచి గిరాకీ నెలకొనడంతో కార్ల విక్రయాలు నవంబర్ మాసంలో జోరందుకున్నాయి. 2024 నవంబర్ మాసంలో దాదాపు 3,50,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

భారత కార్ల కంపెనీలు ఫుల్ ఖుషీ..! పెళ్లిళ్ల సీజన్‌లో కార్ల విక్రయాల జోరు
Car Sales in November 2024
Follow us on

Car Sales in November 2024: పండుగల సీజన్ ముగిసినప్పటికీ భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జోష్ తగ్గలేదు. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మంచి గిరాకీ నెలకొనడంతో కార్ల విక్రయాలు నవంబర్ మాసంలో జోరందుకున్నాయి. మారుతి సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తదితర దిగ్గజ వాహన సంస్థ దేశీయ అమ్మకాలు పెరిగాయి. 2024 నవంబర్ మాసంలో దాదాపు 3,50,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది (2023) ఇదే నెల నవంబర్ మాసంతో పోల్చితే కార్ల విక్రయాల్లో 4 శాతం వృద్ధి నమోదయ్యింది. 2023 నవంబర్‌లో 3,35,954 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

పలు కారణాలతో నవంబర్ మాసంలో విక్రయాల జోరు కొనసాగడంతో భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది. పెళ్లిళ్ల సీజన్ , గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ నెలకొనడంతో పాటు SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) అమ్మకాలు పెరగడం, లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లకు డిమాండ్ నెలకొనడం వాహన విక్రయాల పెరిగేందుకు దోహపడినట్లు మారుతి సుజుకీ ఇండియాకు చెందిన మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఫలితంగా ఫెస్టివల్ సీజన్ కారణంగా అక్టోబర్ మాసంలో ఏర్పడిన కార్ల విక్రయాల జోరు నవంబరు మాసంలో కూడా కొనసాగిందన్నారు.

మారుతీ సుజుకీ కార్ల విక్రయాల్లో వృద్ధి..

మారుతీ సుజుకీ నవంబర్ మాసంలో దేశీయ మార్కెట్‌లో 1,41,312 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. గత ఏడాది నవంబర్ మాసంలో నమోదైన 1,34,158 యూనిట్ల విక్రయాలతో పోల్చితే 5 శాతం వృద్ధిని సాధించింది. మారుతీ మొత్తం పోర్ట్ ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 29 శాతంగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదట్లో ఇది 25.2 శాతంగానే ఉంది. యుటిలిటీ వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదుకాగా.. చిన్న కార్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. ఇటీవల స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దేశీయ విక్రయాలు 2 శాతం తగ్గాయి. 2024 నవంబర్‌లో 48,246 యూనిట్ల విక్రయాలను హ్యుందాయ్ ఇండియా నమోదుచేసుకుంది.

టాటా మోటార్స్ నవంబర్ మాసంలో 47,117 యూనిట్ల విక్రయాలతో 2023 నవంబర్ మాసంతో పోల్చితే 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 24,446 యూనిట్ల విక్రయాలతో 44.4 శాతం వృద్ధిని సాధించింది.

2023 క్యాలెండర్ ఇయర్‌లో మొత్తం 41.08 లక్షల యూనిట్ల కార్ల విక్రయాలు జరిగాయి. 2024 క్యాలెండర్ ఇయర్‌లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ గత ఏడాదితో పోలిస్తే 4.2 శాతంగా ఉండే అవకాశముందని అంచనావేస్తున్నారు.