రాబోయేది వర్షాకాలం.. మీ కార్ ఇన్సూరెన్స్‌ను ఓ సారి చెక్ చేసుకోండి! ఎందుకంటే?
భారీ వర్షాలు, వరదలతో కారు దెబ్బతింటే బీమా కవరేజ్ తెలుసుకోవడం ముఖ్యం. థర్డ్ పార్టీ పాలసీ వరద నష్టాలను కవర్ చేయదు. సమగ్ర బీమా, ఇంజిన్ ప్రొటెక్షన్ వంటి అదనపు కవర్లు మాత్రమే ఇంజిన్ హైడ్రోస్టాటిక్ లాక్‌కు రక్షణనిస్తాయి. కారు నీటిలో చిక్కుకుంటే స్టార్ట్ చేయకుండా, వెంటనే బీమా సంస్థకు తెలియజేసి క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించాలి.

భారీ వర్షాలు, వరదల కారణంగా వాహనాలు దెబ్బతినడం ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా నగరాల్లో నీరు నిలిచిపోవడం వల్ల కార్ల ఇంజిన్లు, ఎలక్ట్రికల్ భాగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అయితే చాలా మంది వాహన యజమానులు తమ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అన్ని రకాల వరద నష్టాలను కవర్ చేస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది పాలసీ రకం, అలాగే ప్రమాదం జరిగిన తర్వాత తీసుకున్న చర్యలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ వరద నష్టాలను కవర్ చేయదు. కేవలం సమగ్ర (కాంప్రహెన్సివ్) మోటార్ ఇన్సూరెన్స్ ఉన్నవారికే వరదల వల్ల కలిగిన నష్టాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అందుకే పాలసీ తీసుకునే సమయంలో నిబంధనలు, కవరేజ్ అంశాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
వరదలో కారు చిక్కుకున్న వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంజిన్‌లోకి నీరు వెళ్లి ఉండే అవకాశం ఉన్నప్పుడు కారును స్టార్ట్ చేయకూడదు. అలా చేస్తే ఇంజిన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి నష్టాన్ని ఇంజిన్ హైడ్రోస్టాటిక్ లాక్‌గా పరిగణిస్తారు. అదనపు ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ లేకపోతే బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది. నష్టం జరిగిన వెంటనే బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. ఆలస్యం చేస్తే క్లెయిమ్ ప్రక్రియ కష్టమయ్యే ప్రమాదం ఉంది. క్లెయిమ్ కోసం సాధారణంగా పాలసీ పత్రం, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, దెబ్బతిన్న వాహనం ఫోటోలు, సరిగా నింపిన క్లెయిమ్ ఫారమ్ అవసరం అవుతాయి. వాహనం పూర్తిగా ధ్వంసమైనా లేదా కొట్టుకుపోయినా పోలీసు ఫిర్యాదు కూడా అడగవచ్చు.
క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత బీమా సంస్థ ఒక సర్వేయర్‌ను పంపుతుంది. అతను వాహన నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇస్తాడు. ఆ నివేదిక ఆధారంగానే క్లెయిమ్ మొత్తం నిర్ణయించబడుతుంది. బీమా సంస్థ అనుమతి వచ్చే వరకు మరమ్మతులు ప్రారంభించకపోవడం మంచిది. లేకపోతే క్లెయిమ్‌పై వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిపుణుల సూచనల ప్రకారం, వరదలకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే వారు కేవలం సాధారణ కాంప్రహెన్సివ్ పాలసీతో సరిపెట్టకుండా, ఇంజిన్ ప్రొటెక్షన్, జీరో డిప్రెసియేషన్ వంటి అదనపు కవర్లు తీసుకోవడం మంచిది. ఇవి వరదల సమయంలో భారీ మరమ్మతు ఖర్చుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలను ఒకసారి పరిశీలించడం, అవసరమైన అదనపు కవర్లు చేర్చుకోవడం వాహన యజమానులకు భవిష్యత్తులో పెద్ద ఉపశమనంగా మారవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
