Bank loans: బ్యాంకు రుణం రాలేదా..? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి

|

Dec 19, 2024 | 3:08 PM

జీవితంలో అడుగడుగునా అనేక ఆర్థిక పరమైన అవసరాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో అందరికీ గుర్తుకు వచ్చేవి బ్యాంకులు. వీటిలో తక్కువ వడ్డీకి రుణాలను పొందే అవకాశం ఉంటుంది.

Bank loans: బ్యాంకు రుణం రాలేదా..? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
Personal Loans
Follow us on

వ్యక్తిగత అవసరాలు, ఇళ్ల కొనుగోలు, వాహనాల కొనుగోలు, చదువు కోసం.. ఇలా అనేక రకాలైన రుణాలను పొందవచ్చు. మన దరఖాస్తును పరిశీలించి, నిబంధనల మేరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. అయితే ఒక్కోసారి మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ నిరుత్సాహం పడకుండా ఈ కింద తెలిపిన పద్ధతులలో ప్రయత్నిస్తే ప్రయోజనం ఉంటుంది. ముందుగా మీ రుణ దరఖాస్తును ఎందుకు తిరస్కరించారో రుణదాత (బ్యాంకులు)లను అడిగి తెలుసుకోండి. తక్కువ క్రెడిట్ స్కోరు, తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే అధిక రుణం ఉండడం, అసంపూర్ణ డ్యాక్యుమెంటేషన్ దీనికి కారణం కావచ్చు. రుణాలను మంజూరు చేసేముందు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిశీలిస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే వెంటనే తిరస్కరిస్తాయి. కాబట్టి క్రెడిట్ స్కోర్ ను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలి. రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఉండాలి.

మీరు ఆశించిన రుణానికి మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ సరిపోకపోయినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అలాంటి సమయంలో తక్కువ రుణానికి దరఖాస్తు చేసుకోండి. దీనివల్ల బ్యాంకు మీకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంది. మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి హామీతో, సహ దరఖాస్తుదారుడితో రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం తక్కువగా ఉన్నా అతడి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని రుణం మంజూరు చేస్తారు. బ్యాంకుల నుంచి రుణం మంజూరుకాకపోతే ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదించండి. దేశంలోని వివిధ ఎన్ బీఎఫ్ సీలు రుణాలను అందిస్తున్నాయి. బ్యాంకులతో పోల్చితే వీటిలో నిబంధనలు కొంచె సరళంగా ఉంటాయి. వడ్డీ ఎక్కువైనా రుణం తొందరంగా మంజూరవుతుంది. పూచీకత్తుపై రుణాలు పొందడం చాలా సులువుగా ఉంటుంది. బంగారం, ఆస్తి, బీమా పాలసీలను హామీగా పెట్టి రుణాలను పొందవచ్చు. ఉదాహరణకు బంగారంపై బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తాయి.

ఆదాయం పెంచుకోవడం, అప్పులను తగ్గించుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో పాటు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు మీ ఆదాయంతో పాటు ఇంతకుముందున్న రుణాలను కూడా పరిశీలిస్తాయి. బ్యాంకులు మీ రుణ దరఖాస్తును తిరస్కరించినా నిరుత్సాహ పడకండి. అది మీ ఆర్థిక క్రమశిక్షణ సక్రమంగా లేదన్న విషయాన్ని సూచించిందనుకోండి. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం, రుణాలను తగ్గించుకోవడం తదితర పనుల ద్వారా భవిష్యత్తులో మీకు రుణం పొందే అవకాశం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి