CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..

నగరాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు. అయితే అద్దె ఇంటి బయట యజమానులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం చట్టబద్దమైనా.. యజమానికి హక్కు ఉంటుందా అనే చర్చ జరుగుతూ ఉంటుంద. అయితే భారత చట్టాలు ఏం చెబుతున్నాయంటే..

CCTV Rules: అద్దె ఇల్లు బయట యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..?  ఈ రూల్స్ చాలామందికి తెలియదు..
Cc Rules

Updated on: Aug 09, 2026 | 11:20 AM

నగరాలు, పట్టణాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో లేదా ఫ్లాట్ కొనుగోలు చేసి అందులో ఉంటూ ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో యజమాని, అద్దెదారుడు మధ్య తరచుగా వివాదాలు నడుస్తూ ఉంటాయి. అద్దె చెల్లింపు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి వాటి విషయాల్లో గొడవలు జరుగుతుంటూ ఉంటాయి. అందులో ఒకటి సీసీటీవీ కెమెరాలు. నగరాలు, పట్టణాల్లో భద్రత కోసం ప్రతీ ఒక్క ఇల్లు, అపార్ట్‌మెంటుల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే అద్దె ఇంటి బయట లేదా ముఖద్వారం ఎదురుగా యజమాని సీసీటీవీ ఏర్పాటు చేసే విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటి యజమాని ఇలా చేయవచ్చా? అతడికి హక్కు ఉంటుందా..? అనే విషయాలు తరచుగా చర్చకు దారి తీస్తాయి. ఈ నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవచ్చా..?

భారత్‌లోని చట్టాల ప్రకారం ఇంటి యజమాని సీసీటీవీ కెమెరాలను తమ ఆస్తి భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఏ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలనే దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంటి ప్రవేశ ద్వారాలు, ఉమ్మడి ప్రదేశాల్లో భద్రతా ప్రయోజనాల కోసం సీటీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇంటి యజమాని సరైన కారణం చూపించాల్సి ఉంటుంది. అద్దెదారుడి గోప్యతకు భంగం కలిగించేలా విధంగా కెమెరాలను ఏర్పాటు చేయకూడదు. గోప్యతా హక్కు అనేది దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్చ అనేది ప్రతీఒక్కరికీ హక్కుగా లభిస్తుంది. దీంతో యజమాని అద్దెదారుడి గోప్యతకు భంగం కలిగించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయకూడదు.

చట్టాలు ఏం చెబుతున్నాయి..?

1882 ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 108C ప్రకారం అద్దెదారులకు కొన్ని హక్కులు ఉంటాయి. యజమాని ఆస్తిలో అద్దెదారుడు శాంతియుతంగా నివసించే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఇక భారత ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 66E ప్రకారం.. అనుమతి లేకుండా ఎవరిదైనా వ్యక్తిగత స్థలాన్ని లేదా ఆస్తిని ఫోటోలు తీసినా, వీడియోలు చిత్రీకరించినా నేరంగా పరిగణిస్తారు. ఈ నేరాలకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. దీంతో కేవలం ఆస్తి తమది అనుకుని యజమాని ఇష్టారీతిగా సీసీకెమెరాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఈ మేరకు భారత చట్టాలు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అద్దెదారుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను యజమానులు కాపాడాలి. లేకపోతే అద్దెదారుడు యజమానిపై ఫిర్యాదు చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us