
ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్యానికి లక్షల ఖర్చు అవుతుంది. ఒక వ్యక్తి జీతంలో ఎక్కువ భాగం విద్య, వైద్యానికే ఖర్చు అవుతున్నాయి. దీంతో చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా అవసరం కూడా. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుంది. అయితే ఆస్పత్రిలో కొన్ని సార్లు క్లెయిమ్ రిజెక్ట్ అవడం ఆందోళన కలిగిస్తుంటుంది. సంస్థలు చిన్న చిన్న కారణాలతో క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో హెల్త్ పాలసీకి సంబంధించి ఓ వివాదాస్పదమైన కోణం వెలుగులోకి వచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. బీమా కంపెనీలు ఇప్పుడు రోగుల డిజిటల్ డేటాను, ముఖ్యంగా వారి గూగుల్ టైమ్‌లైన్ లొకేషన్స్‌ను పరిశీలించడం గమనార్హం. ఇది ఒక కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక బీమా కంపెనీ రోగి గూగుల్ లొకేషన్ ఆసుపత్రి లొకేషన్‌తో మ్యాచ్ కాకపోవడంతో క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఈ చర్య చట్టబద్ధత, నైతికతలపై పెద్ద చర్చకు దారితీసింది.
వల్లభ్ మోత్కా అనే వ్యక్తి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ నుండి హెల్త్ పాలసీని తీసుకున్నారు. ఆయన న్యుమోనియా కారణంగా సెప్టెంబర్ 2024లో ఆసుపత్రిలో చేరగా.. రూ. 48,251 బిల్లు అయ్యింది. క్లెయిమ్ కోసం అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పటికీ.. గో డిజిట్ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఇందుకు వారు చెప్పిన కారణం విని అతడు ఆశ్చర్యపోయాడు. మోత్కా గూగుల్ టైమ్‌లైన్ డేటాలో ఆసుపత్రి ఉన్న ప్రదేశం కనిపించలేదని.. దీనివల్ల ఆయన ఆసుపత్రిలో ఉన్నట్లు నిర్ధారించలేకపోతున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
కంపెనీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వ్యక్తుల వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించేలా ఉండడమే దీనికి కారణం. అయితే గో డిజిట్ ప్రతినిధి మాత్రం.. తాము పాలసీదారు అనుమతితోనే ఈ డేటాను సేకరించామని తెలిపారు. కానీ వినియోగదారుల ఫోరం గో డిజిట్ వాదనను తిరస్కరించింది. రోగి సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ ఆధారంగా, క్లెయిమ్ చేసిన మొత్తాన్ని (రూ. 48,251) చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
బీమా పాలసీ దరఖాస్తులో క్లెయిమ్ ప్రక్రియలో సహాయపడటానికి డిజిటల్ డేటా వంటి సమాచారాన్ని ఉపయోగించడానికి పాలసీదారు సమ్మతిని అడుగుతారు. ఒకవేళ పాలసీదారు ఒకే అంటే కంపెనీలు చట్టబద్ధంగా ఆ సమాచారాన్ని సేకరిస్తాయి. అయితే అనుమతి లేకుండా లొకేషన్ డేటాను ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఈ కేసులో కంపెనీ తన వాదనకు గట్టి ఆధారాలు చూపించలేకపోయింది. గూగుల్ టైమ్‌లైన్ డేటా ఎల్లప్పుడూ కచ్చితంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు సిగ్నల్ సమస్యలు, సాంకేతిక లోపాల వల్ల లొకేషన్ ట్రాకింగ్ సరిగా జరగకపోవచ్చు. డాక్టర్ సర్టిఫికేట్ వంటి ప్రామాణికమైన వైద్య పత్రాలు ఉన్నప్పుడు, కేవలం డిజిటల్ డేటా ఆధారంగా క్లెయిమ్‌ను తిరస్కరించడం న్యాయబద్ధం కాదు అని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది.
ఈ సంఘటన బీమా కంపెనీలు సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నాయో చూపిస్తుంది. భవిష్యత్తులో పాలసీ తీసుకునేటప్పుడు, క్లెయిమ్ చేసుకునేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ కేసు హెచ్చరిస్తుంది. ఏదైనా డిజిటల్ డేటా వాడకానికి పర్మిషన్ ఇచ్చే ముందు ఆ ఒప్పందం నిబంధనలను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. అవన్నీ చెక్ చేసిన తర్వాతే మీరు పాలసీ తీసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..