
కారు కొనడం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద పెట్టుబడి. కాబట్టి ప్రతి రూపాయిని ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా పురుషులు తమ పేరు మీద కారు కొనుగోలు చేయడం లేదా లోన్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే మీ పేరుకు బదులుగా మీ భార్య పేరు మీద కారు కొంటే లేదా లోన్ తీసుకుంటే అనేక ఆర్థిక, పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. మీ భార్య పేరు మీద కారు కొనడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి.
దేశంలో మహిళలకు మద్దతుగా అనేక రాష్ట్రాలు రోడ్డు పన్నుపై రాయితీలు ఇస్తున్నాయి. మహిళ పేరు మీద కారు రిజిస్టర్ చేస్తే రోడ్డు పన్నుపై 2శాతం నుంచి 10శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 20 వరకు కూడా ఉంటుంది. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 10శాతం తగ్గింపు లభిస్తుంది. రూ.15 లక్షల విలువైన కారు కొంటే మీరు రూ. 20,000 నుండి 40,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. మహిళా దరఖాస్తుదారులకు కారు రుణాలపై సాధారణంగా ఉండే వడ్డీ రేటు కంటే 0.25శాతం నుంచి 0.50శాతం వరకు తక్కువ వడ్డీని అందిస్తాయి. రూ. 20 లక్షల రుణానికి, 7 సంవత్సరాల కాలంలో ఈ చిన్న రాయితీ ద్వారా మీరు రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు ఆదా చేయవచ్చు.
మీరు మీ భార్య పేరు మీద కారు లోన్ తీసుకుంటే పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. లోన్ అసలు చెల్లింపుపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
లోన్ వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ భార్య కూడా ఆదాయాన్ని పొందుతుంటే, మీరు ఉమ్మడి రుణం తీసుకుని, ఇద్దరూ కలిసి ఈ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
మహిళా డ్రైవర్లు ప్రమాదాలకు తక్కువగా గురవుతారనే గణాంకాల ఆధారంగా.. కొన్ని బీమా కంపెనీలు మహిళా డ్రైవర్లకు 5శాతం నుండి 10శాతం వరకు బీమా ప్రీమియంపై తగ్గింపును అందిస్తున్నాయి.
ఇవి పాటించడం ద్వారా మీరు కారు కొనుగోలుపై లక్షల్లో డబ్బు ఆదా చేసుకోవడమే కాకుండా మీ కుటుంబంలో మహిళా సాధికారతకు కూడా మద్దతు ఇచ్చినట్లు అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి