భారతదేశంలో ఇటీవల కాలంలో బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారానే లబ్ధిదారులకు అందిస్తున్నాయి. ముఖ్యంగా జన్-ధన్-ఖాతాలు భారతదేశంలో బ్యాంకింగ్ విప్లవాన్నే సృష్టించాయని చెప్పాలి. భారతదేశ పౌరులందరికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ల ద్వారా బ్యాంకింగ్ సేవలను అన్ని బ్యాంకులు అందించాయి. ముఖ్యంగా డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు కూడా పెరిగాయి. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే వారు ఇటీవల కాలంలో బాగా పెరిగారు. అయితే దృష్టి లోపం ఉన్న వారు బ్యాంకింగ్ సేవలను పొందడంలో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా వారికంటూ ప్రత్యేక చర్యలు ఏవీ లేకపోవడంతో వారు ఇంకా నగదు డిపాజిట్, విత్‌డ్రా కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దృష్టి లోపం ఉన్న వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. బ్రెయిలీ డెబిట్ కార్డులను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ తీసుకున్న చర్యలు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ దృష్టి లోపం ఉన్న కస్టమర్ల కోసం పీఎన్‌బీ అంత: దృష్టి పేరులో బ్రెయిలీ డెబిట్ కార్డ్‌ను ప్రారంభించింది.ఈ కాంటాక్ట్‌లెస్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) డెబిట్ కార్డ్ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉందని పీఎన్‌బీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రెయిలీ డెబిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టడం అనేది చేరిక, ఆర్థిక సౌలభ్యంపై పీఎన్‌బీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆ బ్యాంకు ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు పీఎన్‌బీ ఇలాంటి చర్యలను తీసుకుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇతర బ్యాంకులతో పోలిస్తే పీఎన్‌బీ దృష్టి లోపం ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేక చర్యలను తీసుకోవడం అభినందనీయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయని వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..