Corona Pandemic: కరోనా రెండో వేవ్ దేశవ్యాప్తంగా పీక్ దశలోకి వెళ్ళిపోయింది. కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలు కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు ప్రారంభించాయి. కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. ఇంకా మిగిలిన రాష్ట్రాలు కూడా పరిస్థితిని బట్టి కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో బ్యాంక్ యూనియన్లు ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగుల పట్ల తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు భద్రతా చర్యల కోసం బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. కనీస సిబ్బందితో బ్యాంకు శాఖలను నడపడానికి అనుమతి కోరుతూ పని దినాలను తగ్గించాలని వారు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) కన్వీనర్ సంజీవ్ కె బాండ్లిష్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబాసిష్ పాండాకు ఒక లేఖ రాశారు, “గత సంవత్సరం అమలు చేసినట్లుగా, ఇప్పుడు కూడా భౌతిక బ్యాంకింగ్‌ను పరిమితం చేయవలసిన అవసరం ఉంది. అందువల్ల 4-6 నెలలు పని గంటలను తగ్గించమని బ్యాంకులకు సూచించవచ్చు అంటూ ఆ లేఖలో కోరారు. బ్యాంకులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పనిచేసేలా అనుమతి ఇవ్వాలని చెప్పారు. యుఎఫ్‌బియు అనేది దేశవ్యాప్తంగా తొమ్మిది బ్యాంకింగ్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ. కరోనా చైన్ ను విచ్ఛిన్నం చేయడానికి బ్యాంకింగ్‌ను వారానికి 5 రోజులకు పరిమితం చేయాలని బాండ్లిష్ చెప్పారు. “ఇది సేవలను దెబ్బతీయకుండా బ్యాంకు ఉద్యోగులు మరియు కస్టమర్ల మధ్య భౌతిక సంబంధాన్ని చాలా వరకు తగ్గిస్తుంది” అని ఆయన చెప్పారు.
అదేవిధంగా హబ్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టాలని యుఎఫ్‌బియు కోరుతోంది. అన్ని శాఖలను తెరవడానికి బదులుగా, బ్యాంకులు కొన్ని ఎంపిక చేసిన శాఖలలో బ్యాంకింగ్ సదుపాయాలను అందించగలవని, ఇది చాలా మంది బ్యాంకు ఉద్యోగులను కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ విధానంతో కోవిడ్ -19 కు ఉద్యోగులు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని సంస్థ సూచించింది.
బ్యాంకు కార్మికులకు టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని యుడిబియు కన్వీనర్ మంత్రిత్వ శాఖను కోరారు. బ్యాంకుల సిబ్బంది పని తీరును పరిశీలిస్తే, ప్రతిరోజూ వందలాది మంది కస్టమర్లతో సంప్రదింపులు జరపాల్జసిన అవసరం వారికి ఉంటుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫ్రంట్‌లైన్ కోవిడ్ వారియర్‌గా పరిగణించిన తరువాత, బ్యాంక్‌మెన్‌లందరికీ టీకాలు వేయడానికి చర్యలు ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.