వచ్చే వారంలో మీరేమైనా బ్యాంక్ పనులు పెట్టుకున్నారా.? ముఖ్యమైన ఆర్ధిక లావాదేవీలు నెక్స్ట్ వీక్ చేయాలనుకుంటున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చేవారంలో ఓ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి. ఆ వివరాలు మీకోసమే.
నవంబర్ 19వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ సమ్మెలో పాల్గొంటున్నాయి. దీంతో ఆ రోజున బ్యాంకింగ్, ఏటీఎం సేవలపై ప్రభావం పడనుంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు సమ్మె నోటీసు జారీ చేశారు. బ్యాంక్ సిబ్బంది తమ డిమాండ్ల సాధనకై ఈ సమ్మెకు దిగుతున్నారని అందులో పేర్కొన్నారు.
మరోవైపు సమ్మె రోజున బ్యాంకు శాఖలు, కార్యాలయాలలో పనులు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అయితే సిబ్బంది సమ్మెలో పాల్గొంటే.. బ్యాంకుల, ఏటీఎంల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని ఏఐబీఈఏ పేర్కొంది. కాగా, యూనియన్లపై దాడులు, నాయకులపై వేధింపులు, ప్రతీకారాలు, ఒప్పందాలను ఉల్లంఘించడం, ఉద్యోగుల జీవితాలను అస్థిరపరిచేలా అన్యాయంగా బదిలీలు చేయడం వంటి వాటిని ఖండిస్తూ.. దేశవ్యాప్తంగా ఈ సమ్మెకు దిగుతున్నామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం కొద్దిరోజుల క్రితం పేర్కొన్న సంగతి తెలిసిందే.(Source)