
ఒక ఎంటర్టైన్మెంట్ స్టాక్ షేర్ మార్కెట్లో అద్భుతాలు సృష్టిస్తోంది. కుటుంబ సెంటిమెంట్ టీవీ సీరియళ్లను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన ఆ సంస్థ ఇప్పుడొక మల్టీ బ్యాగర్ స్టాక్ గా అవతరించింది. ఆ సంస్థ పేరు బాలాజీ టెలిఫిల్మ్స్. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇది టీవీ సీరియళ్లు తీస్తుంటుంది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద టీవీ నిర్మాణ సంస్థగా ఉన్న బాలాజీ టెలిఫిల్మ్స్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో మెరుస్తోంది. బాలాజీ టెలిఫిల్మ్స్ షేర్ ధర ఇటీవలి రోజుల్లో పెరగడం ప్రారంభమైంది. మల్టీబ్యాగర్ స్టాక్ గా మారింది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ధర రూ.132గా ఉంది. సోమవారం (ఫిబ్రవరి 26) షేరు ధర రూ.143కి చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలాజీ టెలిఫిల్మ్స్ స్టాక్‌కు గత కొన్ని నెలలుగా మంచి డిమాండ్ ఉంది. సరిగ్గా మూడు నెలల క్రితం, అంటే నవంబర్ 28, 2023న దీని షేరు ధర రూ.66. ఇప్పుడు రూ.132. అంటే ధర రెండింతలు పెరిగింది. ఈ స్టాక్‌లో మూడు నెలల క్రితం ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు అతని షేర్ క్యాపిటల్ రూ.2 లక్షలుగా ఉంటుంది.
ఏక్తా కపూర్ యాజమాన్యంలోని బాలాజీ టెలిఫిల్మ్స్ 2007 వరకు స్టాక్ మార్కెట్‌లో స్టార్ షేర్‌గా ఉంది. 2007లో ఒక దశలో దీని షేరు ధర రూ.354 కంటే ఎక్కువగా పెరిగింది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్మాల్ స్క్రీన్ ప్రొడక్షన్‌కు పోటీ పెరగడంతో ఇది తగ్గిపోయింది.
శనివారం ‘క్రూ’ టీజర్ విడుదలైన తర్వాత బాలాజీ టెలిఫిల్మ్స్ షేర్లు స్టాక్ మార్కెట్ పరిశీలకుల లెన్స్ కింద ఉన్నాయి . కరీనా కపూర్, టబు, కృతి సనన్, దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ క్రూ మూవీని ఏక్తా కపూర్, రియా కపూర్ కలిసి నిర్మించారు. బాలాజీ టెలిఫిల్మ్స్ ప్రమోటర్లలో ఏక్తా కపూర్ ఒకరు కాబట్టి, మార్కెట్ పరిశీలకులు బాలాజీ టెలిఫిల్మ్స్ షేర్లలో కదలికను ఆశించారు. ఇందులో ఏక్తా కపూర్ మొత్తం పెయిడ్-అప్ క్యాపిటల్‌లో 18.23 శాతం కలిగి ఉన్నారు. కాగా స్టాక్ మార్కెట్ లో ఎన్నో ఒడిదుడుకులు చవిచూసిన బాలాజీ టెలిఫిలిమ్స్ ఇప్పుడు రిలయన్స్ సపోర్ట్ తో మళ్లీ పుంజుకుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.1.28 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దీనిలో 24.9 శాతం వాటాను కలిగి ఉంది. కాగా, దాదాపు రూ.214 కోట్ల విలువైన 2.38 కోట్ల వారెంట్లను జారీ చేయాలని బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్ణయించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..