భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్, ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట, అది ఏమేరకు..? అంటే..!

|

Feb 11, 2021 | 8:15 PM

భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్. ఈ ఏడాది భారత్ లో జీతాలు 6.4 శాతం పెరిగే అవకాశం ఉందట. సగటున, జీతాల పెంపు బడ్జెట్‌లో 20.6 శాతం మేరకు ఆయా కంపెనీల్లో..

భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్, ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట, అది ఏమేరకు..? అంటే..!
Follow us on

భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్. ఈ ఏడాది భారత్ లో జీతాలు 6.4 శాతం పెరిగే అవకాశం ఉందట. సగటున, జీతాల పెంపు బడ్జెట్‌లో 20.6 శాతం  ఆయా కంపెనీల్లో అగ్రశ్రేణి ప్రదర్శన చూపిన ఉద్యోగులకు శాలరీ హైక్ ఉండబోతోందట. ఈ క్యాటగిరీ కిందకి వచ్చే వాళ్లు మన దేశంలో 10.3 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక, మొత్తంగా భారతదేశంలో జీతాలు ఈ ఏడాది (2021)లో సగటున 6.4 శాతం పెరిగే అవకాశం ఉందని విల్లిస్ టవర్స్ వాట్సన్ అనే సర్వే సంస్థ లెక్కలు కట్టింది. ఆ సంస్థ వెలువరించిన తాజా శాలరీ బడ్జెట్ ప్రణాళిక సర్వే నివేదిక ప్రకారం 2021లో సగటున 6.4 శాతం నుంచి 7 శాతం వరకూ జీతాల పెరుగుదల ఉండే అవకాశం ఉందని చెప్పింది.

భారతదేశంలోని ఆయా కంపెనీలు కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్ధిక చిక్కులనుంచి కొంచెం కొంచెంగా కోలుకొంటున్న నేపథ్యంలో ఈ మేరకు ఆశావహ వాతావరణం నెలకొందని విల్లిస్ కన్సల్టింగ్ హెడ్ (టాలెంట్ & రివార్డ్స్) రాజుల్ మాథుర్ అన్నారు. గతేడాదితో పోలిస్తే బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిభావంతులైన అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను రక్షించుకునేందుకు ఆయా కంపెనీలు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని మాథుర్ చెప్పుకొచ్చారు.

ఇక, 2021 సంవత్సరానికి గాను, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో సగటు జీతం పెరుగుదల 7 శాతంగా ఉంటుందని సదరు సర్వే అంచనా వేసింది. అంతకుముందు సంవత్సరంలో ఇది 7.1 శాతంగా ఉండగా, ఈ ఏడాది స్వల్పంగా తగ్గింది. ఇక, మిడిల్ మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్, ఇంకా.. సపోర్ట్ స్టాఫ్ జీతాల పెంపు, 2020లో 7.5 శాతం ఉంటే, 2021 లో 7.3 శాతానికి స్వల్ప తగ్గుదల అంచనా వేస్తున్నారు.

విల్లిస్ టవర్స్ వాట్సన్ సంస్థకు చెందిన డేటా సర్వీసెస్ విభాగం ఈ సర్వే లెక్కలు కట్టింది. ఈ సర్వేను అక్టోబర్ / నవంబర్ 2020లో ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 130కు పైగా దేశాల్లోని 18,000 సెట్‌ల అభిప్రాయాల ఆధారంగా ఈ లెక్కలు కట్టారు. ఇక, ఈ ఏడాది ఆసియా పసిఫిక్‌లోని కీలక మార్కెట్లలో అంచనా వేసిన జీతాల పెంపుదల విషయానికొస్తే, ఇండోనేషియా 6.5 శాతం, చైనా 6 శాతం, ఫిలిప్పీన్స్ 5 శాతం, సింగపూర్ 3.5 శాతం, హాంకాంగ్ 3 శాతంగా ఉంటుందని కూడా ఈ సర్వే లెక్కల్లో తేల్చారు.

ఇండియాలో నిర్వహించిన సర్వే ప్రకారం రాబోయే 12 నెలల్లో సానుకూల వ్యాపార పవనాలు ఉంటాయని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. హైటెక్, ఫార్మాస్యూటికల్స్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, రిటైల్ రంగాల్లో మిడిల్ లెవెల్ ఎంప్లాయిస్‌కు జీతం పెరుగుదలను 8 శాతం అంచనా వేశారు. కొవిడ్ -19 కారణంగా వివిధ వ్యాపార రంగాలు ఆయా స్థాయిల్లో ప్రభావితమయ్యాయని సర్వే రిపోర్టులో వెల్లడించారు.

ముఖ్యంగా ఆతిథ్యం, విమానయానం, ప్రయాణ, పర్యాటకం వంటి కొన్ని రంగాలు మిగతా వాటికంటే తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, ఇ-కామర్స్, హైటెక్ వంటి రంగాలు వృద్ధిని సాధించాయని సదరు సర్వే వెల్లడించింది. ఇది 2021లో ఆయా రంగాల్లో కొత్త ఉద్యోగాలు, జీతాల పెరుగుదలను ప్రతిబింబిస్తుందని విల్లిస్ టవర్స్ వాట్సన్ ఇండియా రివార్డ్స్ డైరెక్టర్ అరవింద్ ఉస్రేటే చెప్పారు.