Car Sales: కార్ల సేల్స్ ఢమాల్.. ఎక్కడి స్టాక్ అక్కడే.. ఇంతకీ కారణం ఏమంటే..?

| Edited By: Janardhan Veluru

Sep 09, 2024 | 7:38 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. వినాయక చవితి, దసరా, దీపావళీ సీజన్ నేపథ్యంలో వ్యాపారాలు పుంజుకుంటాయని అందరూ భావించారు. కానీ అనుకోని వర్షాలతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం నష్టాలను చవిచూసింది.

Car Sales: కార్ల సేల్స్ ఢమాల్.. ఎక్కడి స్టాక్ అక్కడే.. ఇంతకీ కారణం ఏమంటే..?
Automobile Sector
Follow us on

వాతావరణ మార్పుల వల్ల అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అనుకోని వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత మూడు నెలలుగా వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అనుకోని వర్షాలతో ఖరీఫ్ వరిసాగు పూర్తిగా దెబ్బతింది. వరదల కారణంగా నాట్లు మునిగిపోయి కుళ్లిపోయాయి. దీంతో మరోసారి నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. వినాయక చవితి, దసరా, దీపావళీ సీజన్ నేపథ్యంలో వ్యాపారాలు పుంజుకుంటాయని అందరూ భావించారు. కానీ అనుకోని వర్షాలతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం నష్టాలను చవిచూసింది.

పెరిగిన ఇన్వెంటరీ స్థాయి..

కంపెనీలు విక్రయించేందుకు తమ దగ్గర ఉంచుకున్న ఉత్పత్తులను ఇన్వెంటరీగా వ్యవహరిస్తారు. వాటి విక్రయాలు తొందరగా జరిగితే వ్యాపారులకు లాభం ఉంటుంది. కానీ వాతావరణ మార్పులతో ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోయాయి. కంపెనీల డీలర్ల వద్ద ఇన్వెంటరీ పెరిగిపోయింది. జూన్ లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 67 రోజులకు చేరుకుంది. అది జూలైలో 72 రోజులకు, ఆగస్టులో 75 రోజులకు పెరిగింది. దీంతో మూడునెలలుగా ఆటోమొబైల్ డీలర్లు ఇన్వెంటరీ స్థాయి పెరిగిపోవడంతో సంక్షోభాన్ని ఎదుర్కొటున్నారు. గత నెలలో రూ. 77 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇన్వెంటరీలు ఆటో డీలర్‌షిప్‌ల వద్ద పేరుకుపోయాయి.

కారణాలు ఇవే..

వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం. పండగల సీజన్ వచ్చినా మార్కెట్ ఊపందుకోకపోవడానికి అధిక వర్షాలే కారణం. దేశంలోని అన్ని రకాల కంపెనీలు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, స్కిన్‌కేర్ కంపెనీ ఇమామి, పెప్సికో బాట్లింగ్ సంస్థ వరుణ్ బెవరేజెస్ వరకూ అన్ని కంపెనీలు అమ్మకాలు లేక ఒత్తిడిలో ఉన్నాయి.

ఎఫ్ఏడీఏ వివరాల ప్రకారం..

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) సేకరించిన సమాచారం ప్రకారం.. వర్షాల కారణంగా వరదలు రావడంతో పంట, ఆస్తి నష్టం జరిగింది. దీంతో దేశంలో ప్రయాణికుల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్టులో ఐదుశాతం క్షీణించాయి. అయితే ఆటో రిటైల్ మార్కెట్ లో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 2.8 శాతం స్వల్ప పెరుగుదల ఉంది. ప్రధానంగా గత ఏడాది కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.2 శాతం పెరిగాయి. అయితే నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాల మార్కెట్ ఏడాది ప్రాతిపదికన 4.5 శాతం క్షీణించింది. వాణిజ్య వాహనాలలో 6 శాతం తగ్గుదల నమోదైంది. ట్రాక్టర్ రిటైల్ విక్రయాలు కూడా గతేడాదితో పోలిస్తే 11 శాతం తగ్గుదల కనిపించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 8.5 శాతం నెలవారీ క్షీణతతో ఈ ఏడాది 6.05 శాతం తగ్గుదలను చవిచూశాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..