పండుగ సీజన్ వచ్చేసింది. మీరు టీవీ, ఫ్రిజ్ లేదా మరేదైనా వస్తువును కొనడం కోసం సిద్ధం అవుతూ ఉండవచ్చు కూడా. వీటికోసం షాపింగ్ చేసినపుడు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ దొరికి ఉండవచ్చు. ఇది సాధారణ ఈఎంఐ కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడమే ఈ ఆప్షన్ ఉద్దేశం. ఈ విధానంలో ఖరీదైన వస్తువులను వాయిదాల పద్ధతిలో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి ఖర్చు లేని ఈఎంఐ ఆఫర్‌లో కస్టమర్ నుంచి ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. ఈ మాట వినగానే సాధారణంగా అందరికీ ఒక సందేహం వస్తుంది. ఇలా వడ్డీ లేకుండా లోన్ ఇవ్వడం వలన బ్యాంకులు లేదా NBFCలకు ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ వలన లాభాలు.. వచ్చే ఇబ్బందులూ ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం.
నిజానికి ఈ సదుపాయం బ్యాంకులకు, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం.. వినియోగదారులకు మాత్రం నష్టమే అని చెప్పాలి. ఇందులో కస్టమర్‌కు ప్రయోజనం ఏమిటంటే, వారు ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టనవసరం లేకుండా ఖరీదైన వస్తువులను వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ లేదా NBFCకి ప్రయోజనం ఏమిటంటే, వారి బిజినెస్ డెవలప్ అవుతుంది. వారికి వారు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వస్తుంది. చిల్లర వ్యాపారులకు ప్రయోజనం ఏమిటంటే వారి అమ్మకాలు పెరగడం.
మీరు ఒక ప్రోడక్ట్ ని కొన్నపుడు డబ్బు ముందే పేమెంట్ చేస్తే కనుక.. రిటైలర్ మీకు డిస్కౌంట్ ఇస్తాడు. నో-కాస్ట్ ఈఎంఐ విషయంలో, ఈ డిస్కౌంట్ బదులుగా పూర్తి ధర ఛార్జ్ చేస్తారు. ఆ తగ్గింపు బ్యాంకుకు చెల్లిస్తారు. అంటే మార్జిన్‌లో కొంత భాగం మీ పేమెంట్ గా లోన్ ప్రాసెస్ చేసిన బ్యాంక్ లేదా NBFCకి షేర్ అవుతుంది.
దీనికి సంబంధించి, పన్ను – పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ మాట్లాడుతూ.. నో-కాస్ట్ ఈఎంఐ విషయానికి వస్తే, ఒక విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం. మీరు ఒక ప్రోడక్ట్ కి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ని ఉపయోగించి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పూర్తి పేమెంట్ చేస్తే.. మీకు దానిపై భారీగా డిస్కౌంట్ వస్తుంది. విరుద్ధంగా, నో కాస్ట్ ఈఎంఐలో, మీరు ఆ తగ్గింపు నుంచి ప్రయోజనం పొందలేరు అని చెబుతున్నారు. దీనిలో, రిటైలర్ మీ నుంచి ప్రోడక్ట్ పూర్తి ధరను తీసుకుంటారు. ఆ ధర ఆధారంగా మీ ఈఎంఐ సిద్ధం చేస్తారు.
దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం.. మీరు ల్యాప్‌టాప్‌ని కొంటున్నారని అనుకుందాం. దాని విలువ 60,000 రూపాయలు. దీనిని మీరు పూర్తి పేమెంట్ చేసి కొన్నట్లయితే.. కొంత శాతం తగ్గింపు వస్తుంది. మీకు 10శాతం తగ్గింపు లభిస్తుందని అనుకుందాం. అప్పుడు, 6,000 రూపాయలను తీసివేస్తే, ఇప్పుడు మీరు 54,000 రూపాయలు చెల్లించాలి. కానీ మీరు ఈ ల్యాప్‌టాప్‌ను నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే, మీకు 6,000 రూపాయల తగ్గింపు లభించదు. మీ ఈఎంఐ పూర్తి 60,000 రూపాయలకూ లెక్కిస్తారు.
కొన్నిసార్లు, రిటైలర్లు ప్రోడక్ట్ కాస్ట్ కు ముందస్తుగా వడ్డీ ఛార్జీలను యాడ్ చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు మీరు కొత్త ధరపై నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందుతారు.. కాబట్టి మీరు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో 60,000 రూపాయల ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసినప్పుడు.. లెక్కించిన వడ్డీ ఈ ధరకు యాడ్ చేస్తారు. అంటే మీరు 60 వేల రూపాయల ల్యాప్ టాప్ కోసం 66 వేల రూపాయలను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి వస్తుంది.
కాబట్టి, దీనిని నో కాస్ట్ ఈఎంఐ అని పిలుస్తారు. అయితే వడ్డీ ఛార్జీ మీ నుంచి ముందుగానే వసూలు చేస్తారు. అంతేకాకుండా మీరు ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాలి. దీనిని ఫైల్ ఛార్జ్ అని కూడా అంటారు. మీరు ప్రతి ఈఎంఐతో ఈ ఫీజును చెల్లించాలి.
దానితో పాటు బ్యాంకులు సర్వీస్ ఛార్జీని కూడా వసూలు చేస్తాయి. బ్యాంక్‌లు లేదా NBFCలు నో-కాస్ట్ ఈఎంఐని అందించేవి, ప్రాసెసింగ్ ఫీజు ద్వారా దాన్ని తిరిగి పొందుతాయని బల్వంత్ జైన్ చెబుతున్నారు. ఎక్కడైనా, ఇది తప్పనిసరిగా మీ జేబు నుంచి వసూలు చేస్తారు అని అయన అంటున్నారు.
నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కోసం క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వలన ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. అంతేకాకుండా, మీరు సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయకపోతే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది మీ రుణాలు తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా తనఖాలు వంటి ఇతర ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ పొందడంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. అందుకే ఈ పండుగ సీజన్‌లో నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోళ్లు చేసే ముందు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి