ఆర్థిక లాావాదేవీలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరికీ బ్యాంకుఖాతా అవసరం. మన దేశంలో దాదాపు అందరికీ వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి. ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డులను అందజేస్తాయి. వాటిని ఉపయోగించి ఏటీఎంలో డబ్బులను డ్రా చేయవచ్చు. ఈ కార్డులను ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులుగా వ్యవహరిస్తారు. ఈ రెండు మాటలు మనకు తరచుగా వినిపించేవే. సాధారణంగా డెబిట్, ఏటీెఎం కార్డులు రెండు ఒక్కటేనని అందరూ భావిస్తారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఒకేలా ఉంటాయని అనుకుంటారు. వాస్తవానికి ఈ రెండు కార్డులు వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి.
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరుగుతోంది. బ్యాంకులకు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిలబడి లావాదేవీలను నిర్వహించే రోజులు పోయాయి. ఇంటి వద్దనే కూర్చుని ఆన్ లైన్ లో చిటికెలో బ్యాంకు లావాదేవీలను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సంబంధించిన అన్ని విషయాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల మధ్య వ్యత్సాసాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. బ్యాంకులో ఖాతా ఉన్నప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డును అందజేస్తారు. దీన్ని వివిధ రకాల లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ రకాల లావాదేవీలు జరపవచ్చు. ముఖ్యంగా ఏటీఎంలలో డబ్బులను డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది.
దుకాణాలలో కొనుగోళ్లు చేయడానికి వాడవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడు ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం కూడా వినియోగించుకోవచ్చు. అంటే దాదాపు అన్ని రకాల లావాదేవీలకు డెబిట్ కార్డు ఉపయోగపడుతుంది. వీసా, మాస్టర్ కార్డు, రూపే తదితర చెల్లింపు నెట్‌వర్క్‌లకు దేశంలోని అన్ని రకాల డెబిట్ కార్డును అనుసంధానం చేశారు. వీటి ద్వారా ఏటీెఎంల వద్ద మాత్రమే కాకుండా, పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డులను అందజేస్తున్నాయి. వీటిపై చెల్లింపు నెట్‌వర్క్ లోగోతో పాటు బ్యాంక్ లోగో ఉంటుంది. ఏటీఎం కార్డు విషయానికి వస్తే.. ఈ కార్డు ప్రధానం ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవడానికి, ఖాతా నిల్వలను తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది నేరుగా బ్యాంక్ ఖాతాకు లింక్ చేస్తారు. కానీ రిటైల్ కొనుగోళ్లు, ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగపడదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి