పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా అయితే ఐదు లక్షలో, పది లక్షలో, కోటో, పది కోట్లో అంటారు. వ్యక్తిగత ఆర్థిక స్థాయిని బట్టి ఈ ఖర్చు ఆధారపడి ఉంటుంది. కానీ వందలు, వేల కోట్లతో ఎవరైనా పెళ్లి
చేసుకుంటారు అని ఊహిస్తారా? అది కొద్ది మంది శ్రీమంతులకు మాత్రమే చెల్లుతుంది. అలాంటి పెళ్లి చూడాలంటే అంబానీ ఇంట కల్యాణ వేడుకను కనులారా చూడాల్సిందే. అందుకే మన దేశంలో పెళ్లిళ్ల
మార్కెట్ 10 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఒక్క పెళ్లికి దాదాపు రూ.2000 కోట్ల ఖర్చు. అది కూడా మన దేశంలోనే. విందు భోజనంలో 2 వేలకు పైగా వెరైటీ వంటకాలు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో స్టేజ్
షోలు. వాళ్లకు రెమ్యునరేషన్ గా పదుల కోట్ల రూపాయిలు. ఈ వివాహ వేడుక ఎవరిదో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అదే అంబానీల ఇంట వివాహం. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి
అంగరంగవైభవంగా చేయడం కోసం.. అంబానీల కుటుంబం కొన్ని నెలలుగా వేడుకలు నిర్వహించింది. దానికి తగ్గట్టుగానే మార్చిలో మొదలుపెట్టి.. జూలై వరకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను చేసింది. ఖరీదైన వెడ్డింగ్
కార్డులతో పాటు గిఫ్టులు ఇచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులను పెళ్లి మండపానికి తరలించడానికి దాదాపు పదులుకొద్దీ విమానాలను అద్దెకు తీసుకుంది. దీనిని బట్టి ఈ పెళ్లికి ఏ స్థాయిలో
ఏర్పాట్లు చేశారో మీకు అర్థమై ఉంటుంది. ఇలా భారీ స్థాయిలో జరిగే వివాహాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. దేశంలో అన్ని పెళ్లిళ్లూ ఈ స్థాయిలో కాకపోయినా.. ఎవరికి
తగ్గ స్థాయిలో వారు చేస్తున్నారు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News APP డౌన్లోడ్ చేసుకోండి.
వందల కోట్ల రూపాయిల సెట్టింగులు.. వేల రకాల వంటకాలు, ప్రపంచంలోనే అతిరథ మహారథులంతా అతిథులుగా, భూమిపై ఉన్న టాప్ సెలబ్రెటీలతో వినోద కార్యక్రమాలు, అన్ని రంగాలకు చెందిన దిగ్గజాలు..
ఇంతమందిని ఒక్క చోట చేర్చగలిగింది మాత్రం అంబానీ కుటుంబమే. ఒకటా రెండా.. ఒకరా ఇద్దరా.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది అంటుంటాం కదా.. అంబానీ ఇంట పెళ్లి విషయంలో ఇది
కరెక్ట్ గా సరిపోతుంది. వంటకాల సంగతే చూడండి. పెళ్లికి ముందు గుజరాత్ లో నిర్వహించిన వేడుకలోనే దాదాపు రెండు వేల 500 రకాల వంటకాలను వడ్డించారు. అసలు అక్కడ ఏమేం వెరైటీలు ఉన్నాయో
చూడ్డానికే గంటల సమయం పడుతుంది. ఇక ఇప్పుడు పెళ్లి వేడుక. ఈ సంబరాలకు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అతిథులను తీసుకురావడానికి ఏకంగా మూడు ఫాల్కన్-2000 జెట్స్ తో పాటు దాదాపు
100 విమానాలను అంబానీ ఫ్యామిలీ బుక్ చేసింది. దీనిని బట్టి ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో వేరే చెప్పక్కరలేదు.
పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేయవచ్చు అని ఎవరైనా అడిగితే.. సింపుల్ గా అంబానీ ఇంట వివాహ వేడుకను చూపించవచ్చు. ఎందుకంటే.. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిపిన ప్రీ వెడ్డింగ్ వేడుక కోసమే దాదాపు
1200 కోట్లు ఖర్చు పెట్టింది. సంప్రదాయ వేడుకలు, భారీ విందు భోజనాలు, కళ్లు చెదిరే డెకరేషన్లు.. పెళ్లికి అంబానీలు చేసే ఖర్చు ఎలా ఉంటుందో ఇవన్నీ తెలియజేస్తాయి. అందుకే ప్రపంచమంతా ఈ వేడుకను
కళ్లారా చూసింది. కొంతమందికి మాత్రమే ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. నిజానికి ఒక్క రోజులో చేసుకునే పెళ్లి వేడుక కాస్తా.. ఇప్పుడు రోజులు, వారాలు, నెలల తరబడి సాగుతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల
పేరిట.. దేశ విదేశాల్లో వాటిని నిర్వహిస్తున్నారు. ఇక సెలబ్రెటీలకు చెల్లించిన మొత్తాలు కూడా తక్కువేమీ కాదు. అవి కూడా పదుల కోట్లలోనే ఉంటున్నాయి.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి అంటే.. ఆ రేంజ్ లో ఉంటుంది మరి.. అనిపించేలా ఏర్పాట్లు చేశారు. తరతరాలకు చెప్పుకునేలా వీటిని అరేంజ్ చేశారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన
అంబానీ ఇంట పెళ్లంటే.. రాజుల ఇంట వివాహ సంబరాన్ని మించిపోతోంది. వివాహ వేడుకలకు దాదాపు 1200 మంది అతిథులను ఆహ్వానించారు. వీరంతా టాప్ సెలబ్రెటీలే. ఇక ఈ పెళ్లి వేడుకలకు
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలను కూడా పిలిచారు. ఈ సెలబ్రేషన్స్ బడ్జెట్ దాదాపు 320 మిలియన్ డాలర్లని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పత్రిక రిపోర్ట్ చేసింది.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ఝం చేశారు. దాదాపు 3 వేల రకాల వంటకాలు ఉంటాయని అంచనా. కాశీలోని ఛాట్ భాండార్ లో రుచులను ఇష్టపడిన నీతా
అంబానీ వాటిని స్పెషల్ గా తన కుమారుడు పెళ్లి భోజనాల లిస్టులో ఏరికోరి యాడ్ చేశారు. ఇందులో చనా కచోరీ, టిక్కీ ఛాట్, దహీపూరి, కుల్ఫీ, బనారస్ ఛాట్, పాలక్ ఛాట్. టమాట ఛాట్.. ఇంకా మరికొన్ని
రకాలు ఉన్నాయి. సో.. తింటే అంబానీల పెళ్లి భోజనమే తినాలిచూస్తే.. అంబానీల ఇంట పెళ్లే చూడాలి అన్నట్టుగా ఈ సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేశారు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News APP డౌన్లోడ్ చేసుకోండి.
Wedding Market In India 1అన్ని మ్యారేజ్ లు అంబానీల స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ పెళ్లంటే ఖరీదైన మండపాలు, అదిరిపోయే లైట్ సెట్టింగ్ లు, ఓ 50 రకాల వంటకాలు, వందల్లో అతిథులు, బ్యాండ్ బాజాలు, డీజే ఏర్పాట్లు, మెహందీ
ఫంక్షన్లు, అప్పగింతలు.. ఇలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. దీనికి తోడు ఖర్చు ఎంతయినా పర్లేదు.. మనకు మాట రాకుండా ఉండాలి. వచ్చినోళ్లకు ఎక్కడా లోటు రాకూడదు అనేవాళ్లకు కొదవే లేదు. ఇది
అప్పటికే ఉన్న ఖర్చుని మరింత పెంచుతుంది. అలా మన దేశంలో ఏటా పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అసలు మన పెళ్లిళ్ల మార్కెట్ ఎంతో తెలుసా? దాదాపు 10 లక్షల కోట్ల రూపాయిలు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News APP డౌన్లోడ్ చేసుకోండి.
పది లక్షల కోట్లా అని చాలామంది అనుకుంటారు. అసలు పెళ్లి ఖర్చు విషయంలో ఎవరు తగ్గుతున్నారు చెప్పండి. ఓ మధ్యతరగతి కుటుంబంలో పెళ్లంటే తక్కువలో తక్కువ నాలుగైదు లక్షల ఖర్చయినా ఉంటుంది.
దేశంలో దాదాపు 30 కోట్ల కుటుంబాలు ఉన్న మన దేశంలో ఏటా దాదాపు కోటి పెళ్లిళ్లయినా జరుగుతాయి. అదే గట్టి ముహూర్తాలు ఉంటే.. ఈ సంఖ్య పెరగొచ్చు. అంటే ఇందులో ఒక్కో పెళ్లికి అయ్యే ఖర్చు ఎంత
ఉంటుందో ఈజీగా ఊహించుకోవచ్చు. అందుకే మన దేశంలో పెళ్లిళ్ల చుట్టూ ఇన్ని లక్షల కోట్ల మార్కెట్ రూపుదిద్దుకుంది. ఇది ఏటేటా పెరుగుతోంది.
మన దేశ జనాభా దాదాపు 150 కోట్లు. ఆహారం, నిత్యావసరాలు.. ఈ రెండింటి తరువాత మనవాళ్లు ఎక్కువగా ఖర్చు పెడుతోంది కేవలం పెళ్లిళ్లపైనే. జెఫ్రీస్ రిపోర్ట్ చెప్పిందీ ఇదే. ఇంకో లెక్కలో చెప్పాలంటే..
ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అయ్యే ఖర్చు కంటే.. పెళ్లి కోసం పెడుతున్న ఖర్చే దాదాపు డబుల్ ఉంది. మన దేశంలో ఏటా ఒక్కో సీజన్ లో కనీసం 30 లక్షల నుంచి 40 లక్షల పెళ్లిళ్లయినా జరుగుతాయని
అంచనా. ఒక్కో ఇంట్లో జరిగే పెళ్లికి ఎలా లేదన్నా కనీసం నాలుగైదు లక్షల నుంచి కోటి రూపాయిలైనా ఖర్చు అవుతాయి. దీనిని బట్టి ఏటా జరిగే కోటి పెళ్లిళ్లకు ఎంత మార్కెట్ ఉంటుందో ఈజీగా అర్థం
చేసుకోవచ్చు. అందుకే మ్యారేజ్ ఇండస్ట్రీ పై కొన్ని కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయి.
మన పొరుగు దేశం చైనాలో ఏటా 70 నుంచి 80 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయి. అదే అమెరికాలో ఏటా 20 నుంచి 25 లక్షల మ్యారేజ్ లు ఉంటాయి. ప్రపంచంలో జరిగే పెళ్లిళ్లలో చైనా, భారత్ వాటాయే దాదాపు
సగం ఉంటుంది. చైనాలో పెళ్లిళ్ల కోసం 170 బిలియన్ డాలర్లు ఖర్చు పెడితే.. అమెరికాలో 70 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తారు.
చైనా కన్నా తక్కువే అయినా మన వాళ్లు పెట్టే ఖర్చు తక్కువేమీ కాదు. మనవారు..
ఆహారం, నిత్యావసరాల కోసం 681 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 56 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. దీని తరువాత మన వివాహ పరిశ్రమదే అతిపెద్ద స్థానం. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు… మన వాళ్లు పెళ్లిళ్ల
కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తారో!
మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News APP డౌన్లోడ్ చేసుకోండి.
పెళ్లంటే.. గోల్డ్, సిల్వర్ జువెలరీ కొంటారు. పెళ్లి కోసం కొనే నగలలో పెళ్లి కూతురు వాటాయే పెద్దది. ఇక వస్త్రాలకైతే.. ఖర్చు చెప్పక్కరలేదు. కానుకల కోసం.. వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు
చేస్తారు. వీటన్నింటి ఖర్చు చూస్తే.. ఆ నెంబర్ చాలా పెద్దగా ఉంటుంది. పైగా పెళ్లంటే ఒక్కరోజులో ముగిసే తంతు కూడా కాదు. ఈమధ్య ఎక్కువ రోజులు పెళ్లి వేడుకను చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లకూ
భారీగానే ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఒక్కో పెళ్లి కోసం సగటున ఖర్చు చేస్తోంది.. 15 వేల డాలర్లు. అంటే దాదాపు 12 లక్షల రూపాయిలు. ఓరకంగా చూస్తే.. ఇది మన తలసరి ఆదాయం కంటే ఎక్కువే. కొన్ని
కుటుంబాల ఆదాయం కంటే ఎక్కువే. కానీ అమెరికాలో మాత్రం ఇలా కాదు.. పిల్లల చదువుకయ్యే మొత్తం ఖర్చులో దాదాపు సగాన్ని మాత్రమే పెళ్లిళ్లకు ఖర్చు పెడుతుంటారు.
ఓ పెద్దింట్లో పెళ్లి అంటే.. సుమారు ఆరు నెలల ముందు నుంచే సందడి ఉంటుంది. కనీసం 50 వేల విస్తరాకులు వేయాల్సిందే. వంద వెరైటీలైనా వడ్డించాల్సిందే. అంతమంది అతిథులతో కల్యాణ మండపం
కళకళలాడాల్సిందే. మామూలుగా అయితే పెళ్లంటే.. రెండు మనసులు, రెండు కుటుంబాల కలయిక. కానీ ప్రాక్టికల్ గా చూస్తే.. ఇలా జరగడానికి లక్షల రూపాయిలు కావాలి. అందుకే మన వివాహ పరిశ్రమ
ఇంతలా కాంతులీనుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలు, లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఉదాహరణకు పెళ్లి అంటే ఫోటోలతో పాటు వీడియో మస్ట్. అది కూడా కనీసం మూడు నాలుగు రోజుల పాటు
తీయాల్సి ఉంటుంది. ఒక్కో పెళ్లికి దీనికోసం 30,000 నుంచి 70,000 రూపాయిలైనా ఖర్చవుతుంది. దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి పెళ్లళ్లయినా జరుగుతాయనుకుంటే.. ఈ లెక్కే 50 వేల కోట్లను
దాటిపోతుంది. ఇక వంటకాలు, లైటింగ్, డెకరేషన్… ఇలా ఒక్కో దాని బిజినెస్ ను లెక్కతీస్తే.. 10 లక్షల కోట్ల రూపాయిల మార్కెట్ ఉండడం పెద్ద విషయమేమీ కాదు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం TV9 News APP డౌన్లోడ్ చేసుకోండి.