Amazon New CEO Andy Jassy: అమెజాన్‌ కొత్త సీఈవో ఖరారు.. జూలై 5న సీఈవో పదవి నుంచి తప్పుకుంటానన్న జెఫ్ బెజోస్

|

May 27, 2021 | 11:48 AM

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు కొత్త సీఈవో రాబోతున్నారు. ఆండీ జెస్సీ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారయింది.

Amazon New CEO Andy Jassy: అమెజాన్‌ కొత్త సీఈవో ఖరారు..  జూలై 5న సీఈవో పదవి నుంచి తప్పుకుంటానన్న జెఫ్ బెజోస్
Amazon Senior Exective Andy Jassy As New Ceo
Follow us on

Amazon New CEO Andy Jassy: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు కొత్త సీఈవో రాబోతున్నారు. ఆండీ జెస్సీ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారయింది. అమెజాన్‌కు సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబుతున్నానని.. ఆండీ జెస్సీ సీఈవోగా వ్యవహరిస్తారని ఫిబ్రవరిలోనే ప్రస్తుత సీఈవో జెఫ్ బెజోస్ చెప్పారు. అయితే, కొత్త సీఈవో ఏ రోజున బాధ్యతలు చేపడతారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. బుధవారం ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చారు జెఫ్ బెజోస్. జూలై 5న తాను సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని.. ఆ రోజు నుంచి అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలను చేపడతారని వెల్లడించారు. జులై 5 తనకు ఎంతో సెంటిమెంట్ అని.. అందుకే ఆ రోజే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు జెఫ్ బెజోస్ తెలిపారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ సమావేశంలో ఈ ప్రకటన చేశారు.

”జులై 5ను ఎందుకు ఎంపిక చేశానంట, అది నాకు సెంటిమెంట్. ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం.. అంటే 1994లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జులై 5 నాకు ఎంతో ప్రత్యేకమైనది.” అంటూ జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. జెఫ్ బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా నియామకం కానున్నారు. ఇక బెజోస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై ఆయన మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం అమెజాన్ మరో కీలక ప్రకటన చేసింది. హాలీవుడ్ స్టూడియో MGMను 8.34 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. మరిన్ని షోలు, సినిమాలతో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌ను యూజర్లకు అందజేస్తామని తెలిపింది.

కాగా, 77 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మేందుకు ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.67 ట్రిలియన్ డాలర్లు.

ఇక కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జెస్సీ.. 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఆయన జులై 5న అమెజాన్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also…  Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో 191 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు చివరి తేదీ జూన్‌ 23