ప్రస్తుతం ప్రపంచాన్ని మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఐటీ కంపెనీలు ఉద్యోగుల్లో కోతలు పెట్టడం ఆర్థిక మంద్యానికి సంకేతమని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్తలకు ఊతమిచ్చేలా తాజాగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భారీగా నష్టపోయాడు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఒకేరోజు ఏకంగా 21 బిలియన్ డాలర్లు నష్టపోయారు. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.1 లక్షా 25 వేల కోట్లు.. అమెజాన్ షేర్లు భారీగా పతనమవడమే ఇందుకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మాంద్యం భయాలు అమెరికా మార్కెట్లను ముంచేశాయి. దీంతో ఈ-కామర్స్ దిగ్గజం జెఫ్ బెజోస్ తీవ్రంగా నష్టపోయారు.
అమెజాన్ షేర్లు కుంగడంతో ఆ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ తగ్గడంతో పాటు బెజోస్ సంపద క్షీణించింది. స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టడం తగ్గించి కృత్రిమ మేధస్సుపై భారీ మొత్తంలో ఖర్చు చేయాలని యోచిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ఇటీవల ప్రకటించారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ షేర్లు శుక్రవారం 13 శాతం పడిపోయాయి.
దీంతో బెజోస్ నికర సంపద 185.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019 ఏప్రిల్ 4న ఆయన తన భార్యకు విడాకులు ప్రకటించడంతో ఆ రోజు అతని సంపద భారీగా క్షీణించింది. ఆ తర్వాత ఒక్కరోజులో ఇంత మొత్తంలో క్షీణించడం ఇదే మొదటిసారి. జెఫ్ బెజోస్ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..