Alert For Bank Customers: ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇలా విలీనం అయిన వాటిలో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటైడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లున్నాయి. అయితే పైన పేర్కొన్న ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉంటే ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం ఈ ఏడు బ్యాంకుల్లో అమల్లో ఉన్న పాస్‌బుక్, చెక్‌బుక్‌లు ఏప్రిల్ 1నుంచి చెల్లుబాటు కావు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. విలీనం అయిన బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ విషయమై ఇప్పటికే సమాచారాన్ని అందిచాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. అయితే సిండికేట్ బ్యాంకు మాత్రం ఈ విషయంలో కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు ఖాతాదారులకు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ పేర్కొంది.
Also Read: Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?