బాదుడే బాడుడు.. ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ తరహా పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు అమాంతం పెరిగాయి. ఈ పెరిగిన ఖర్చును భారతీయ విమానయాన సంస్థలైన ఆకాసా ఎయిర్, ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఇప్పుడు ప్రయాణికులపైకి ఇంధన సర్‌ఛార్జ్ రూపంలో బదిలీ చేస్తున్నాయి.

బాదుడే బాడుడు.. ఎయిర్‌ ఇండియా, ఇండిగో బాటలోనే మరో కంపెనీ!
Affordable Air Travel

Updated on: Mar 15, 2026 | 8:00 AM

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ తరహా పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ATF ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. ఈ పెరిగిన ఖర్చును విమానయాన సంస్థలు ఇప్పుడు నేరుగా ప్రయాణికులపైకి బదిలీ చేస్తున్నాయి. భారతదేశంలోని ప్రధాన ఎయిర్‌లైన్స్ ఇప్పటికే అదనపు ఇంధన సర్‌ఛార్జ్‌ను అమలు చేయడం ప్రారంభించాయి. ఆకాసా ఎయిర్‌ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం మార్చి 15 నుంచి బుక్ చేసే టిక్కెట్లపై కొత్త ఇంధన ఛార్జీ వర్తిస్తుంది. ఈ సర్‌ఛార్జ్ దేశీయ, అంతర్జాతీయ విమానాలకు రెండింటికీ వర్తిస్తుంది. అయితే మార్చి 15కు ముందు టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. విమాన దూరం, మార్గం ఆధారంగా ఈ సర్‌ఛార్జ్ నిర్ణయించబడుతుంది. ఆకాసా ఎయిర్ ప్రయాణికులు ఇప్పుడు టిక్కెట్ ధరపై రూ.199 నుండి రూ.1300 వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

విమానయాన సంస్థల ప్రకారం, విమానాల నిర్వహణలో ఇంధన ఖర్చు అతిపెద్ద వ్యయం. తాజా ధరల పెరుగుదల సంస్థల మొత్తం బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఇండిగో కూడా తన మార్గాల్లో ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఛార్జీలు మార్చి 14 నుంచి అమలులోకి వచ్చాయి.

ఇండిగో కొత్త రేట్ కార్డ్ ప్రకారం

  • భారత్‌ నుంచి ఉపఖండ ప్రాంతాలకు విమానాలకు రూ.425
  • మధ్యప్రాచ్య దేశాలకు విమానాలకు రూ.900
  • ఆగ్నేయాసియా, చైనాకు విమానాలకు రూ.1800
  • ఆఫ్రికా, పశ్చిమ ఆసియాకు విమానాలకు రూ.1800
  • యూరప్‌కు విమానాలకు రూ.2300

ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విధానాన్ని మొదటగా ప్రారంభించింది ఎయిర్‌ ఇండియా. సంస్థ ఇప్పటికే మార్చి 12 నుంచి టిక్కెట్లపై అదనపు ఇంధన ఛార్జీ అమలు చేసింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మొదటి దశలో భాగంగా దేశీయ విమానాలు, SAARC దేశాలకు వెళ్లే విమానాలపై రూ.399 అదనపు రుసుము విధించారు. విమాన ఇంధన ధరలు స్థిరపడకపోతే, భవిష్యత్తులో విమాన టిక్కెట్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us