ఓవైపు ఆర్థిక మాంద్యం వార్తలు, మరోవైపు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండడం వెరసి.. ప్రపంచమంతా అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందా అని ఉద్యోగులు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ సెక్టార్ ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త తెలిపింది. గ్లోబల్ సంక్షోభం కారణంగా 2023లో కార్పొరేట్ ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, 2023 నాటికి భారతీయ కార్పొరేట్ ప్రపంచం 2022 కంటే ఎక్కువగా తన ఉద్యోగుల వేతనాన్ని పెంచడానికి సిద్ధమవుతోందని నివేదిక పేర్కొంది. కార్న్ ఫెర్రీ సర్వే ప్రకారం.. 2022లో సగటు జీతం పెరుగుదల 9.2 శాతంగా ఉంది, అది 2023లో 9.8 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సర్వే ప్రకారం.. ఎక్కువ మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కంపెనీలను వదిలి వేరే చోటికి వెళ్లకుండా చూసుకోవడంపై కంపెనీలు దృష్టి సారించాయి. దీని కోసం కంపెనీలు వివిధ రకాల టాలెంట్ మేనేజ్‌మెంట్ దశలు, అధిక జీతాల ద్వారా ప్రతిభ ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సర్వేలో భాగంగా 818 కంపెనీలను పరిగణలోకి తీసుకున్నారు. 2023లో సగటు జీతాలు 9.8 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 2020లో కరోనా కాలంలో ఉద్యోగుల సగటు జీతం 6.8 శాతం మాత్రమే పెరిగింది.
ఇక లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్‌లో సగటు జీతం 10.2 శాతం, హై టెక్నాలజీ రంగాలలో 10.4 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా సేవా రంగంలో 9.8 శాతం, ఆటోమోటివ్‌లో 9 శాతం, కెమికల్స్‌లో 9.6 శాతం, రిటైల్‌లో 9 శాతం సగటు జీతాలు పెరుగుతాయని అంచనా. విషయమై కార్న్ ఫెర్రీ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా మాంద్యం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చర్చ జరుగుతోంది. అయితే భారతదేశ జిడిపి 6 శాతానికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ఆలోచన ఉంది. అగ్రశ్రేణి ప్రతిభావంతులకు కంపెనీలు 15 నుంచి 30 శాతం వేతనాలు పెంచవచ్చని’ ఆయన తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..