New Fraud Method: వెలుగులోకి నయా మోసం… కార్డు, ఓటీపీ వివరాలేమి లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ

|

May 21, 2023 | 7:00 PM

పెరిగిన టెక్నాలజీనే వినియోగించుకుని ఖాతాదారులను మోసం చేస్తూ సొమ్మును తస్కరిస్తున్నారు. అయితే ఇలా చేయాలంటే కార్డు వివరాలు లేదా బ్యాంకు మనల్ని ధ్రువీకరించుకునే ఓటీపీ కావాలి. అయితే తాజాగా ఇలాంటి వివరాలు ఏమి లేకుండానే ఖాతాలను ఖాళీ చేసే తాజా మోసం వెలుగులోకి వచ్చింది.

New Fraud Method: వెలుగులోకి నయా మోసం… కార్డు, ఓటీపీ వివరాలేమి లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ
cyber crime
Follow us on

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపరంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రజలు కూడా సొమ్మును ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకు ఖాతా దాచుకుంటున్నారు. గతంలో మన దగ్గర ఉన్న సొమ్మును ఖాజేసే బందిపోటు దొంగలు ఉన్నట్లే తాజాగా సైబర్ మోసగాళ్లు అంటే సైబర్ దొంగలు పుట్టుకొచ్చారు. పెరిగిన టెక్నాలజీనే వినియోగించుకుని ఖాతాదారులను మోసం చేస్తూ సొమ్మును తస్కరిస్తున్నారు. అయితే ఇలా చేయాలంటే కార్డు వివరాలు లేదా బ్యాంకు మనల్ని ధ్రువీకరించుకునే ఓటీపీ కావాలి. అయితే తాజాగా ఇలాంటి వివరాలు ఏమి లేకుండానే ఖాతాలను ఖాళీ చేసే తాజా మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)ను భారత ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఉపయోగిస్తుంది. అయితే సైబర్ మోసగాళ్లు ఈ విధానం ఉపయోగించి నయా మోసానికి తెర తీశారు. మోసగాళ్లు ఈ విధానాన్ని ఎలా ఉపయోగించుకుని మోసగిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

ఏఈపీఎస్ ద్వారా సొమ్ము విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉండాలి. అలాగే వినియోగదారుడు వేలి ముద్ర ద్వారా వారిని ధ్రువీకరించి సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఏఈపీఎస్ ద్వారా సొమ్ము ఇచ్చే వారికి బ్యాంకులు కమీషన్ చెల్లిస్తూ బ్యాంకింగ్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అయితే మోసగాళ్లు వేలిముద్ర సమయంలో కస్టమర్లను ఏమార్చి వారి వేలిముద్రలను సేకరించి సిలికాన్ వేలిముద్రలు తయారు చేసి దర్జాగా సొమ్మును కాజేస్తున్నారు. ఇలాంటి విధానం కొత్తది కావడం బ్యాంకులు కూడా ఈ మోసంపై ఖాతాదారులను ఎలర్ట్ చేయడం లేదు.

ముఖ్యంగా ఇలాంటి మోసగాళ్లు ఏటీఎం సెంటర్ల వద్ద కాపుగాసి డబ్బులు ఇస్తున్నట్లు నటించి వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇలాంటి కేసులు ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఈ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు. మోసపూరితంగా వినియోగదారుల ఆధార్ నెంబర్లు సేకరించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏఈపీఎస్ ద్వారా కేవలం విత్ డ్రా మాత్రమే కాకుండా డిపాజిట్, బ్యాలెన్స్ తనిఖీ వంటి సేవలు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది ఈ సేవలు వినియోగిస్తున్నారు. అయితే వినియోగదారులకు విత్ డ్రా మెసేజ్‌లు వెళ్లకుండా మోసగాళ్లు జాగ్రత్త పడడంతో మళ్లీ వాళ్లు బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకునేదాక మోసపోయినట్లు గుర్తించడం లేదు. దీంతో మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. కాబట్టి ఏఈపీఎస్ వినియోగించి నగదు ఉపసంహరించుకునేప్పుడు నమ్మకమైన వారి దగ్గరకు మాత్రమే వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి