Economy Budget 2022: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఈ సంవత్సరం తన గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో, కరోనా కాలంలో, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా ఆర్థిక భారం వారిని తీవ్రంగా వేధించిందని పేర్కొన్నారు. దీంతో రానున్న బడ్జెట్(Budget 2022)లో ఈ విషయంపై ప్రధాని మోడీ(PM Narendra Modi) ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో మహిళల ఆర్థిక సవాళ్లకు కొన్ని పరిష్కారాలు దొరకుతాయని అంతా ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నుంచి కొన్ని ప్రత్యేక రాయితీలను మహిళాలోకం ఆశిస్తోంది.
మహిళలకు 5.50 లక్షల పన్ను మినహాయింపు పరిమితి..
ఈసారి బడ్జెట్‌లో రూ. 5.50 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను శ్లాబ్‌లో తమకు పన్ను రహితం చేయాలని, తద్వారా పన్ను ఆదా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని దేశ మహిళలు కోరుతున్నారు. ప్రస్తుత పన్ను శ్లాబ్‌లో పురుషుల కంటే మహిళలకు భిన్నమైన మినహాయింపులు లేవు. 2012కి ముందు పురుషుల కంటే మహిళలకే ఎక్కువ పన్ను మినహాయింపు లభించేది. అయితే 2012-13 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మహిళలకు అదనపు పన్ను మినహాయింపు పరిమితిని రద్దు చేసి సాధారణ పన్ను శ్లాబ్‌తో సమానంగా మార్చారు. దీంతో ఈ సారి బడ్జెట్‌లో మహిళలకు పన్ను మినహాయింపులో ఎక్కువ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మహిళలకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు..
ప్రస్తుతం రూ.50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ అందరికీ అందుబాటులో ఉంది. దీని పరిమితిని రూ.75,000కు పెంచాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా స్టాండర్డ్ డిడక్షన్‌లో మహిళలకు రూ.25 వేల రూపాయల అదనపు ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
గృహ రుణంపై అధిక పన్ను మినహాయింపు.. ప్రస్తుతం మహిళలకు రూ.2 లక్షల వరకు ఉన్న గృహ రుణంపై పన్ను మినహాయింపు లభిస్తుండగా, దీనిని రూ.2.50 లక్షలకు పెంచాలని మహిళలు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై మహిళలు ప్రత్యేక ఆశలు పెట్టుకున్నారు. మరి ఆర్థిక మంత్రి మహిళలకు ఎలాంటి వరాలు ఇవ్వనున్నారో మూడు రోజుల్లో తేలిపోనుంది.
Also Read: