KCR on union budget: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నేడు కేంద్ర బిజెపి(BJP) ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్…దశ దిశా నిర్దేశం లేని., పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి వున్నదని అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్‌ను సీఎం అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి(Agriculture Sector)ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్‌కంటాక్స్‌లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు.
‘‘ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి పరుస్తుంటే.. ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమ’’ని సీఎం పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని ముఖ్యమంత్రి ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
Also Read: Digital Rupee: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ