Budget 2022 – PM-KISAN: వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై బడ్జెట్‌లో స్వల్పంగా పెంచింది మోడీ సర్కర్. 2021-22 సంవత్సరంలో రూ.1,47,764 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.1,51,521 కోట్లకు పెంచారు. మరోవైపు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi) పథకానికి బడ్జెట్ కేటాయింపులో స్వల్ప పెరుగుదల కనిపించింది. దీని కోసం 2021-22లో 65000 కోట్లు కేటాయించగా, 2022-2023కి రూ.68000 కోట్లకు పెంచారు. మరోవైపు ఫసల్ బీమా పథకానికి రూ.15500 కోట్లు కేటాయించారు. ఎరువులకు సబ్సిడీగా 2022-23లో రూ.105222 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో రైతులకు చౌకగా ఎరువులు అందే మార్గం సుగమమవుతుంది.
అయితే ఈ ఏడాది కూడా ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించలేదు. అంటే ఎరువుల కంపెనీలకు ఈ మొత్తం సబ్సిడీ ఇవ్వనుంది. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం బడ్జెట్ రూ. 134420 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం 2022-23లో వ్యవసాయానికి రూ.1,51,521 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసింది. కాగా, 2013-14 సంవత్సరంలో వ్యవసాయ శాఖకు బడ్జెట్‌లో రూ.21,933.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు దానికంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మొదటి బడ్జెట్ కేటాయింపు రూ.75000 కోట్లు. కానీ 2021-2022 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు తగ్గించి రూ.65000 కోట్లకు చేర్చింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఈ తగ్గింపు ఎటువంటి తేడాను కలిగించలేదు. ఎందుకంటే పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం 2022-2023 సంవత్సరానికి 68000 కోట్ల రూపాయలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది.
పీఎం కిసాన్ నిధి బడ్జెట్ పెంపు కూడా రైతులపై ప్రభావం చూపడం లేదు. ఎందుకంటే రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 మాత్రమే వస్తుంది. బడ్జెట్ కేటాయింపులు పెరగడం వల్ల ఏటా రూ.6,000 మొత్తంలో పెరుగుదల ఉంటుందని కాదు.. పీఎం కిసాన్ యోజనలో దాదాపు 11 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. యూపీ, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచుతుందని రైతులు ఆశించినా అది జరగలేదు. ఇది 100% సెంట్రల్ ఫండ్ పథకం, దీనిలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎం- కిసాన్ పథకం కింద కేంద్రం మూడు విడతులుగా ఏడాదికి రూ. 6 వేలు చొప్పున రైతులకు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 38.40 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: వర్చువల్ ర్యాలీలతో దూసుకుపోతున్న ప్రధాని మోడీ.. వెనకబడిన ప్రధాన పార్టీలు..