Budget 2021 : వార్షిక బడ్జెట్‌లో అందరూ ఊహించినట్టుగానే కేంద్రం ఆర్ధిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కోవిడ్ కారణంగా కుదేలయిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏకంగా 137 శాతం అదనపు కేటాయింపులు చేసింది. అలాగే, ఆరోగ్య రంగానికి కూడా గతం కంటే ఎక్కువగా నిధులు కేటాయించింది. ఆరోగ్య రంగానికి ఏకంగా రూ.2.34 లక్షల కోట్లు, టీకా కోసం రూ.35 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. మరోవైపు, ఆదాయపు పన్ను పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, ఫించన్‌దారులకు మాత్రం ఆదాయపన్ను నుంచి మినహాయింపులు మాత్రం ఇచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.
అయితే, కరోనా కాలం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసింది. బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు కేటాయింపులు అత్యధికంగా జరగడం ప్రధాన అంశం. ఇక మొత్తం బడ్జెట్‌ను పరిశీలిస్తే శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
రూ.4.78 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. దీనిలో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19 శాతం పెరగడం విశేషం. ఈ విషయమై లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లలో రక్షణ రంగంలో ఈ స్థాయి మూల ధన వ్యయం లేదని వెల్లడించారు. ఇక, అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ.. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు రూ. 2,56,948 కోట్లు కేటాయించారు.
✺ హోం మంత్రిత్వ శాఖ: రూ.1,66,547 కోట్లు
✺ గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1,33,690 కోట్లు
✺ వ్యవసాయ, రైతుల సంక్షేమం: రూ.1,31,531 కోట్లు
✺ రోడ్డు రవాణా, జాతీయ రహదారులు : రూ.1,18,101 కోట్లు
✺ రైల్వేలు: రూ.1,10,055 కోట్లు
✺ విద్యా శాఖ : రూ.93,224 కోట్లు
✺ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ : రూ.73,932 కోట్లు
✺ గృహ, పట్టణ వ్యవహారాల శాఖ : రూ.54,581 కోట్లు
✺ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు
✺ స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు
✺ ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన అనే కొత్త పథకం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకానికి తొలి కేటాయింపులు రూ.64,180 కోట్లు.
Read Also… సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడదు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్