Budget 2021 : కేంద్ర బడ్జెట్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్ కాగితరహితం డిజిటల్ రూపంలో ఉండబోతుంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్ బడ్జెట్ పత్రాలను ముద్రణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కూడా బడ్జెట్ పత్రాలకు బదులు ల్యాప్‌టాప్‌తో పార్లమెంట్‌కు బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
కాగా, మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ పేపర్‌లెస్‌గా మారింది. అయితే ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ట్యాబ్‌లో పొందుపరిచారు. ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మలా సీతారామన్ కనిపించారు.
అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే ఈసారి నిర్మలమ్మ చేతిలో సంప్రదాయ బాహి ఖాటాకు బదులు మేడిన్ ఇండియా ట్యాబ్ కన్పించింది. గతంలో బడ్జెట్ కాపీలను ఆర్థిక మంత్రులు లెదర్ సూట్‌కేసులు పట్టుకొచ్చేవారు. అయితే 2019, 2020లో నిర్మలా సీతారామన్ మాత్రం సంప్రదాయ బాహీ ఖాటా(వస్త్రం లాంటి సంచి)లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ట్యాబ్‌లో బడ్జెట్ పద్దును తీసుకొస్తున్నారు.
1947 నవంబరు 26న తొలిసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణ చేపడుతున్నారు. బడ్జెట్ సమావేశానికి రెండు వారాల ముందు ఈ ప్రింటింగ్ మొదలుపెడతారు. అయితే ఈసారి కరోనా విజృంభణ నేపథ్యంలో బడ్జెట్ పత్రాల ముద్రణ చేపట్టకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు పార్లమెంట్ ఉభయసభల సభ్యులు కూడా సమ్మతించడంతో ప్రింటింగ్ చేపట్టలేదు. అందుకు బదులుగా సభ్యులందరికీ బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇవ్వనున్నారు.