ప్రతిపాదనలు పట్టాలు పరుచుకోవడం లేదు. మరి ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా?

| Edited By: Ram Naramaneni

Feb 01, 2021 | 6:58 AM

ప్రతిపాదనలు పట్టాలు పరుచుకోవడం లేదు. విన్నపాలే తప్ప రైళ్లు కూతపెట్టటం లేదు. ఇచ్చిన హామీలకూ నిధులు రాలటం లేదు. తెలుగురాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌ ప్రతీసారీ ఎర్రజెండానే..

ప్రతిపాదనలు పట్టాలు పరుచుకోవడం లేదు. మరి ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా?
Follow us on

ప్రతిపాదనలు పట్టాలు పరుచుకోవడం లేదు. విన్నపాలే తప్ప రైళ్లు కూతపెట్టటం లేదు. ఇచ్చిన హామీలకూ నిధులు రాలటం లేదు. తెలుగురాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌ ప్రతీసారీ ఎర్రజెండానే చూపిస్తోంది. మరి ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా? అనే చర్చకు మళ్లీ పచ్చ జెండా పడింది. వరంగల్‌ టూ వైజాగ్‌, జంక్షన్‌ ఏదయినా ఏటా తెలుగురాష్ట్రాలకు నిరాశే ఎదురవుతోంది. పది అడిగితే తప్పదన్నట్లు ఒకటీ అరా విదిలిస్తోంది కేంద్ర బడ్జెట్‌. ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీపై ప్రతీసారీ తూచ్‌ అంటోంది కేంద్రం.

అలాగే హైదరాబాద్- కాజిపేట్ మధ్య ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారు. అదే విధంగా మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు ఓరుగల్లు ప్రజలు. గిరిజన యూనివర్సిటీకి అనుమతితో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదాపై ఆశలుపెట్టుకున్నారు. డిమాండ్లు సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు వరంగల్‌ ఎంపీలు.

దక్షిణభారత అయోధ్యగా పేరున్న భద్రాచలానికి రైల్వేలైన్‌ ప్రజల చిరకాల డిమాండ్‌. భద్రాచలం రోడ్‌నుంచి కొవ్వూరుకు రైల్వేలైన్‌ ఏర్పాటైతే కొత్తగూడెం శరవేగంగా అభివృద్ధిచెందుతుందని ఆశపడుతున్నారు. కొత్తగూడెం టూ డోర్నకల్‌ డబల్‌లైన్‌ ప్రతిపాదనలను ఈసారైనా అటక దించాలని కోరుకుంటున్నారు.

నిధుల్లేక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైల్వేలైన్‌ పనులు నత్తనడక నడుస్తున్నాయి. మనోహరాబాద్‌-పెద్దపల్లి రైల్వేలైన్‌ పనులు గజ్వేల్‌ వరకే పూర్తయ్యాయి. ఐదు నెలలక్రితం ట్రయల్‌రన్‌ నడిపినా ఇంకా రైలు అందుబాటులోకి రాలేదు. నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే గజ్వేల్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ పనులకు కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఏపీ విషయానికొస్తే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటై రెండేళ్లయినా జీవితకాలం లేటన్నట్లే సాగుతోంది సౌత్ కోస్ట్ రైల్వే. DPRని సిద్ధంచేసినా జోన్‌కోసం ఇప్పటిదాకా కేటాయించింది కేవలం మూడు కోట్ల రూపాయలే. జోన్ ఏర్పాటైందనే ఆనందం కంటే వాల్తేరు డివిజన్ రద్దు పైనే ఉత్తరాంధ్రవాసుల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. డివిజన్ కేంద్రంతో కూడిన జోన్ కావాలనే డిమాండ్ కొనసాగుతోంది.

ప్రయాణికులు, సరుకు రవాణాతో ఏటా కోట్లాది రూపాయల ఆదాయమొస్తున్నా..గుంతకల్‌ రైల్వేడివిజన్‌ అభివృద్ధికి నోచుకోవడం లేదు. శ్రీకాళహస్తి-నడికుడి ప్రాజెక్ట్‌ ఎప్పటికి పూర్తవుతుందో తెలీడం లేదు. 18ఏళ్లక్రితం హామీఇచ్చిన కాడ్పాడి-తిరుపతి డబల్‌లైన్‌ ఇప్పటికీ పట్టాలెక్కలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సర్క్యూట్‌ ట్రైన్స్‌ హామీ పదేళ్లుగా అడుగు ముందుకేయలేదు. తిరుపతి రైల్వేస్టేషన్‌ ఆదాయవనరుగా తప్ప అభివృద్ధి చెందలేదు.

రేణిగుంట క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌ సామర్థ్యాన్ని 100 యూనిట్లనుంచి 200 యూనిట్లకు పెంచాలన్న ప్రతిపాదన అలాగే ఉంది. కొత్త రైళ్ల ప్రతిపాదనలు, తిరుపతినుంచి ఢిల్లీ సహా కీలక లైన్లలో డెయిలీ ట్రైన్‌ డిమాండ్లను ఏటా బడ్జెట్‌ పెడచెవిన పెడుతూనే ఉంది. మరి ఈ బడ్జెట్‌లోనైనా తెలుగురాష్ట్రాల విన్నపాలను కేంద్రం మన్నిస్తుందో లేదో చూడాలి.