ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవ్వతలపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు)కు సంబంధించిన ఎంపిక విధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజా సేవలో కొనసాగిన, కొనసాగుతున్న విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి ఏడాదికి రెండు సార్లు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డులివ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది కూడా.
తాజాగా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాసేవలో విశిష్ట వ్యక్తులను గుర్తించి అవార్డులు అందజేయనున్నారు. మొత్తం 11 విభాగాల్లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయించింది. సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ – ఇంజనీరింగ్ , వాణిజ్యం- పరిశ్రమలు, పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా, వైద్యం-పరిశోధనలు, సాహిత్యం-కళలు, క్రీడలు, ప్రభుత్వ సర్వీసులో ఉన్నత సేవలు, మానవహక్కులు- జీవవైవిధ్య పరిరక్షణ తదితర అంశాల్లో లైఫ్ టైమ్ అవార్డులు ఇవ్వనున్నారు.
ప్రతీ ఏటా ఇచ్చే రెండు సార్లు ఇవ్వనున్న ఈ అవార్డులకు విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యతలను సాధారణ పరిపాలన (జిఏడి) పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ప్రతీ ఏటా జనవరి 26న ఒకసారి, ఆగస్టు 15 తేదీన రెండోసారి.. కలిపి మొత్తం రెండు సార్లు మొత్తంగా 100 మంది వరకు అవార్డులు ఇస్తారు. అవార్డు గ్రహీతలకు పది లక్షల రూపాయల నగదు బహుమతితోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున జ్ఞాపికను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు గాను.. ప్రతీ ఏటా మొత్తం 20 కోట్ల రూపాయలను నగదు బహుమతికి కేటాయించనున్నది జగన్ ప్రభుత్వం.