ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ జర్నలిస్ట్ ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో జర్నలిస్టును సజీవ దహనం అయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. బలరాంపూర్‌లోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే, ఇదే అదునుగా గుర్తు తెలియని దుండగులు ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో జర్నలిస్టు రాకేష్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు సజీవదహనం అయ్యారు. అయితే, ఈ ఘటన సమయంలో జర్నలిస్ట్ భార్య, పిల్లలు ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యలు ప్రాణాలను దక్కించుకోగలిగారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు బాధ్యులుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జిల్లా అధికారులు మృతుడి భార్యకు అందించారు. అలాగే, బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్ట్ భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు.