భారతదేశ గాన గంధర్వుడు.. నింగికేగిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెమోరియల్ పై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ‘నాన్నగారి అభిమానులకోసం అయన స్మారకమందిరాన్ని తప్పకుండా నిర్మిస్తాము. ఆయన ఎంతో ఇష్టపడే ఆయన ఫార్మ్ హౌస్ లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తాము. తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్నగారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా, ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తాము. దానిని ప్రజలకి అంకితం చేస్తాం’. అని చరణ్ అన్నారు.
ఇలా ఉండగా, బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు లో ఉన్న తన ఇంటిని వేద పాఠశాలకు ఇస్తున్నానని, అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టులోనే ఆ విగ్రహాలను ఆవిష్కరించవలసి ఉంది. అయితే ఆయనకి ఈ లోపు కరోనా వైరస్ సోకడంతో బాలసుబ్రమణ్యం ఆ విగ్రహాలను ఆవిష్కరించ లేకపోయారు. తన తల్లిదండ్రులు విగ్రహాలను చేయమని చెప్పిన సమయంలోనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయాలని తూర్పుగోదావరిజిల్లాలోని శిల్పికి సూచించారు బాలు. ఇకిప్పుడు బాలు విగ్రహాన్ని కూడా అక్కడే ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.