గాలి ద్వారా కరోనా సోకే అవకాశముందంటున్న సైంటిస్టులు

|

Jul 06, 2020 | 6:04 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, రోజుకో కొత్త లక్షణాలతో కరోనా రూపాంతరం చెందుతోందంటున్నారు సైంటిస్టులు. అటు, ప్రాణాంతక కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తిచెందుతుందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. తాజాగా 32 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై డబ్ల్యూహెచ్ఓకు లేఖ రాశారు.

గాలి ద్వారా కరోనా సోకే అవకాశముందంటున్న సైంటిస్టులు
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, రోజుకో కొత్త లక్షణాలతో కరోనా రూపాంతరం చెందుతోందంటున్నారు సైంటిస్టులు. అటు, ప్రాణాంతక కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తిచెందుతుందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. తాజాగా 32 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై డబ్ల్యూహెచ్ఓకు లేఖ రాశారు.

గతంలో కరోనా వ్యాప్తికి గల లక్షణాలను తీసుకోవల్సిన జాగ్రత్తలను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. తుమ్మిన, దగ్గిన, ముక్కు లేదా నోటి నుంచి వెలువడే తుంపర్లు ఇతరుల మీద పడితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, అందుకే మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలని సూచించింది. అదేవిధంగా చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు సూచించారు. అయితే, వైరస్ గాలిద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని, ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయంటూ డబ్ల్యూహెచ్ఓకి వందలాది మంది శాస్త్రవేత్తల బృందం బహిరంగ లేఖ రాశారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సూచనలు, సిఫార్సులను సవరించాలని శాస్త్రవేత్తలు లేఖలో కోరారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టిరేసింది. గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందనడానికి ఖచ్చితమైన, స్పష్టమైన ఆధారాలు దొరకలేదని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ విభాగం అధిపతి డాక్టర్ బెనీడెట్టా అలెగ్రాంజీ అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు బహిరంగ లేఖ రాసిన శాస్త్రవేత్తల బృందం.. వచ్చే వారం సైంటిఫిక్ జర్నల్‌లో దీనిని ప్రచురించాలని భావిస్తున్నారు. మొత్తం 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కణాలు గాలి ద్వారా సంక్రమిస్తాయనే ఆధారాలను వెల్లడించారు. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని రాయిటర్స్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మనుషులకు ఎలా సంక్రమిస్తుందన్న దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. గాలి ద్వారా కరోనా వ్యాపించదని అనేకమంది నిపుణులు చెబుతున్నప్పటికీ, మెడ్‌ ఆర్‌ఎక్స్‌ఐవీ అనే సంస్థ వెల్లడించిన పరిశోధనలో ఇది సాధ్యమేనని స్పష్టం చేసింది. ఇది అత్యంత అరుదుగా మాత్రమే జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇదేగనక జరిగితే మానవాళికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాలకు మరింత ప్రమాదకరమంటున్నారు.