కరోనా టెన్షన్‌కు రోహింగ్యాల బర్డెన్.. పోలీసులకు కొత్త సవాల్

| Edited By: Anil kumar poka

Apr 19, 2020 | 12:15 PM

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో ...

కరోనా టెన్షన్‌కు రోహింగ్యాల బర్డెన్.. పోలీసులకు కొత్త సవాల్
Follow us on

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 6040 మంది రోహింగ్యాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అయిదు వేల మంది రోహింగ్యాలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వేయి మంది.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నలభై మంది రోహింగ్యాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హర్యానా మేవాట్‌లో జరిగిన ముస్లిం మత ప్రార్థనలలో పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న రోహింగ్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మర్కజ్ సదస్సుకు ఎవరైనా వెళ్ళారా? వారు మళ్లీ తిరిగి వచ్చారా? లేక ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారుంటే స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా స్వచ్చందంగా బయటకు రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

రోహింగ్యాలు, మర్కజ్‌కు వెళ్ళి వచ్చిన విదేశీయులు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో దాగున్నారన్న వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. దానికి పంజాగుట్ట మసీదులో పలువురు విదేశీయులు పట్టుబడడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. మత సంబంధమైన విషయం కావడంతో పోలీసులు కూడా మరీ ఎక్కువ జాగ్రత్తగా డీల్ చేస్తుండడం వల్ల రోహింగ్యాలను, మర్కజ్‌ సదస్సుకు అటెండైన విదేశీయులను పట్టుకోవడంలో జాప్యానికి కారణమవుతుందని పలువురు భావిస్తున్నారు.