పతంజలి రూపొందించిన కరోనా మందుపై ఇప్పటికే కేంద్రం అంక్షలు విధించింది. ఎలాంటి చట్టబద్ధత లేని మందును ఉపయోగించవద్దని స్పష్టం చేసింది, కానీ, రాజస్తాన్ కు చెందిన ఓ అస్పత్రి నిర్వహకులు ఏకంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సదరు హాస్పిటల్ కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా పేషెంట్లకు ఆ మందు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) ఆస్పత్రి సిబ్బంది పతంజలి ఆధ్వర్యంలో రూపొందించిన కరోనిల్ మందు వినియోగిస్తున్నారు. అస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఈ మందు ద్వారా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని జైపూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నిమ్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించామన్నారు.
యోగా గురు రాందేవ్ బాబా ఆద్వర్యంలోని పతంజలి నిర్వహకులు మంగళవారం కరోనా మందు పేరుతో కరోనిల్ ను విడుదల చేశారు. హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ సెంటర్, జైపూర్‌లోని నిమ్స్‌తో కలిసి తయారు చేసినట్లు రాందేవ్ బాబా ప్రకటించారు. అదేరోజు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందు తయారికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. మందు తయారీ, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలావుంటే, తాజాగా జైపూర్ లోని నిమ్స్ హాస్పిటల్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజస్థాన్ ప్రభుత్వం దాని యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.