AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ కొనసాగుతుంది.. మోదీ కంటే ముందే చెప్పేసిన కిషన్

దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇంకాస్త కఠినంగా కొనసాగిస్తాం. సొంత విమానాలున్న వారికే ప్రయాణాలకు అనుమతించడం లేదు... ఇక రైళ్ళు, బస్సుల సంగతేంటి..? ఇదేదో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన కాదు... ఆయన కంటే ముందే...

లాక్ డౌన్ కొనసాగుతుంది.. మోదీ కంటే ముందే చెప్పేసిన కిషన్
Rajesh Sharma
|

Updated on: Apr 11, 2020 | 1:41 PM

Share

దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇంకాస్త కఠినంగా కొనసాగిస్తాం. సొంత విమానాలున్న వారికే ప్రయాణాలకు అనుమతించడం లేదు… ఇక రైళ్ళు, బస్సుల సంగతేంటి..? ఇదేదో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన కాదు… ఆయన కంటే ముందే నిర్ణయించేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేసిన ప్రకటన. ఒకవైపు ప్రధాన మంత్రి దేశంలోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న సమయంలోనే బయట మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి దేశంలో ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ మరికొంత కాలం కొనసాగుతుందని ప్రకటించారు.

ఏప్రిల్ 14న అర్ధరాత్రితో దేశంలో లాక్ డౌన్ ముగుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కనీసం కొన్ని రంగాలకైనా మినహాయింపు వుంటుందని మరికొందరు అనుకుంటున్నారు. కానీ చాలా మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కనీసం మరో రెండు వారాలు కొనసాగించాలని సూచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలైతే కేంద్రం కంటే ముందుగానే లాక్ డౌన్ ఏప్రిల్ నెలాఖరుదాకా వుంటుందని ప్రకటించేశాయి. ఈ క్రమంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం.

శనివారం ఉదయం మోదీ వీడియోకాన్ఫరెన్సు కొనసాగుతున్న తరుణంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ లాక్‌డౌన్ నుంచి కొత్తగా ఏ రంగానికి సడలింపు ఉండదు.. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనే ఉంది.. రెడ్ జోన్లలో మరిన్ని కఠిన ఆంక్షలుంటాయి.. లాక్‌డౌన్ సమయంలో ఎవరి కోసం ప్రయాణ సదుపాయాలు కల్పించడం లేదు… సొంత విమానాలున్నవారికే ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదు.. ’’ ఇవి కిషన్ రెడ్డి అన్నమాటలు.

మనదేశంలో కరోనా లక్షణాలు చాలా ఆలస్యంగా బయపడుతున్నాయని, కొందరిలో 30 రోజులు.. ఆ పైనే పడుతోందని కిషన్ రెడ్డి అంటున్నారు. జన్యుపరమైన తేడాలుండడం వల్లనే మనదేశంలో కరోనా వైరస్ వేగంగా బయటపడడం లేదని ఆయన చెబుతున్నారు. అందుకే క్వారంటైన్ ముగిసినా సరే ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని తమ ప్రభుత్వం కోరుతోందని ఆయన చెప్పారు. బస్సులు మాట్లాడుకుని వెళ్తే అంత మంది వెళ్లడం వల్ల మళ్లీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, క్వారంటైన్ ప్రయోజనం నెరవేరకుండా పోతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ, వ్యవసాయాధార రంగాలు, ఫార్మా రంగాలకు ఇప్పటికే సడలింపు ఉందంటున్న కిషన్ రెడ్డి.. నిత్యావసరాల రవాణాకు, గూడ్సు రవాణాకు పూర్తి సడలింపు కొనసాగుతోందని తెలిపారు.

ప్రధాన మోదీ సీఎంలతో మాట్లాడిన తర్వాత హైలెవెల్ మీటింగ్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలలో ఆయన కీలక నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత దేశ ప్రజల ముందుకు వస్తారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం, ఉద్యోగాల సంగతి తర్వాత, ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి అన్నదే అందరి అభిప్రాయమని అన్నారు. కరోనా ప్రారంభమైన దశలో దేశంలో పూణేలో ఒకే ఒక్క ల్యాబ్ ఉండేదని, ప్రస్తుతం దేశంలో 200కు పైగా ల్యాబులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశామని తెలిపారు.