హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఏపీలో వైసీపీ తప్పకుండా గెలుస్తాడనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ చేయలేదన్నారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఏపీ ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు.
చంద్రబాబులో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పక్క పార్టీలపై ఏడ్వకుండా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని హితవు పలికారు. చంద్రబాబు ఢిల్లీలో కాదు.. విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని విమర్శించారు. ఆంధ్రాలో పారిశ్రామికవేత్తలైన ఎంపీల మీద ఐటీ రైడ్స్ జరిగితే చంద్రబాబుకు బాధెందుకు అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ఫలితాలను బట్టే ఫెడరల్ ఫ్రంట్ సమీకరణాలు ఉంటాయని వెల్లడించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో ఉందని తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలన్నది కేసీఆర్ ఇష్టమన్నారు.