
Janasena Party criticizes Jagan government over power tariff hike: విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. అసలే లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బందుల్లో వుంటే ప్రభుత్వం కరెంటు బిల్లులను పెంచడమేంటని జనసేన పార్టీ నిలదీస్తోంది. క్లిష్టపరిస్థితుల్లో కరెంటు బిల్లులు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు.
ఈ మేరకు పోతిన మహేశ్ శనివారం ఉదయం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘‘ లాక్ డౌన్ వల్ల చాలామంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.. ఈ తరుణంలో కరెంట్ బిల్లులు పెంచి వాళ్ళకి షాక్ కొట్టేలా చేశారు.. రెండు నెలల బిల్లు మీద యావరేజ్ చేసాం అని పదే పదే చెప్తున్నారు.. కానీ రెండు నెలలు అయ్యేసరికి స్లాబ్ మొత్తం మారిపోయింది.. గత మూడు నెలల వరకు 750 రూపాయల కరెంట్ బిల్లు చెల్లించిన అదే ఫ్యామిలీకి ఇప్పుడు ఐదు వేల బిల్లు వచ్చింది.. ఏదో ఒక బిల్లు గురించి చెప్పటం లేదు.. దాదాపు 20 బిల్లులు ఉదాహరణగా తీసుకున్నాము.. గృహ వినియోగానికి, వాణిజ్య వినియోగానికి ఒకే రకమైన బిల్లు వేయటం ఎంతవరకు సమంజసం.. ’’ అని మహేశ్ తన ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
మూడు విడతల్లో ప్రభుత్వం ఇచ్చిన రేషన్ ఖర్చు 1400 కోట్లు అయితే కరెంట్ బిల్లుల ద్వారా దండుకున్నది 2800 కోట్లని జనసేన పార్టీ ప్రతినిధి ఆరోపించారు. ‘‘ ఇంటి బయటకి వస్తే కరోనా షాక్ తగులుతుందో లేదో తెలీదు కానీ ఇంట్లో ఉంటే కరెంట్ షాక్ మాత్రం తగులుతుంది.. ఇవ్వాళ ఇంట్లో ఉండటం కంటే క్వారంటయిన్ లో ఉంటే అన్ని సదుపాయాలు ఉంటాయి అనే భావనలో పేదవారు ఉన్నారు.. కరోనాకి అయినా కనికరం ఉంది కాని వైసీపీ ప్రభుత్వానికి అసలు కనికరం లేదు.. ’’ అని మహేశ్ వ్యాఖ్యానించారు.
లాక్ డౌన్ ఉండటం వలన ప్రజలు బయటకి రాలేదు కానీ లేదంటే ఈ పాటికి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేవారని, విద్యుత్ బిల్లులు పెంపుని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, ఏప్రిల్ లో వచ్చిన బిల్లులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది.
Read this: పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ