YS Jagan serious on IAS and IPS officers: ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆదేశించారు. దాంతో కొందరు ఐఏఎస్ అధికారులకు ఆమె మెమోలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్ర రాజధాని అమరావతి వదలి తరచూ హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాలకు ఐఎఎస్-ఐపిఎస్ అధికారులు వెళుతుండడంతో ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక అందడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలేకపోయినాఉన్నతాధికారులు తరచూ ఇలా యాత్రలకు వెళ్తున్నారని సీఎం జగన్ దృష్టికి రావడంతో ఆయన మండిపడ్డారు. అదే సమయంలో విజయవాడలో ఉండి కూడా కొందరు అధికారులు సచివాలయానికి రాకుండా విజయవాడ నగరం నుంచే విధులు నిర్వహిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు అందింది. దాంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయినట్లు తెలుస్తోంది.
కొందరు అధికారులు తరచుగా సెలవు మీద వెళ్తున్నారని, మరికొందరు అనుమతి లేకుండా సెలవు తీసుకుంటున్నారని సీఎం జగన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడంతో సదరు అధికారులందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు. కార్యదర్శులు ఇకపై రాష్ట్రం వెలుపల తరచూ యాత్రలు మానుకోవాలని సీఎస్ నీలం సాహ్ని ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం.
ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో.. అర్జెంట్ అయితే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఎస్ సూచించారు. ముఖ్యమంత్రి ఆగ్రహంతో వ్యక్తం చేసినందున ఈ ఆదేశాలను తూ.చా. తప్పకుండా అందరూ పాటించాలని మెమోలో పేర్కొన్నారు సీ ఎస్ నీలం సాహ్ని. సీఎం సీరియస్ అవడంతో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ముందస్తుగా కొన్ని పర్యటనలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.