కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. సిక్కింలో భారత జవాన్లతో ఘర్షణ

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 1:00 PM

సిక్కిం ఉత్తర ప్రాంతంలో భారత, చైనా దళాలు ఘర్షణకు తలపడ్డాయి. సముద్ర మట్టానికి సుమారు 16 వేల అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో ఉభయ దేశాల సైనికులు రాళ్లు కూడా విసురుకున్నారు.

కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. సిక్కింలో భారత జవాన్లతో ఘర్షణ
Follow us on

సిక్కిం ఉత్తర ప్రాంతంలో భారత, చైనా దళాలు ఘర్షణకు తలపడ్డాయి. సముద్ర మట్టానికి సుమారు 16 వేల అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో ఉభయ దేశాల సైనికులు రాళ్లు కూడా విసురుకున్నారు. ఈ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ అలైన్ మెంట్ విషయంలో భారత, చైనా దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రెండు దేశాల స్థానిక కమాండర్లు సర్ది చెప్పడంతో ఘర్షణ వాతావరణం సద్దు మణిగింది.

చైనా సైనికుల దూకుడును భారత సైనికులు వీడియో తీశారు. కాగా తమ తమ దేశాల కమాండర్లు బుజ్జగించడంతో ఎవరి స్థానాలకు వారు మళ్లారు. సరిహద్దుల వివాదం పరిష్కారం కాకపోవడంతో తరచూ ఇలాంటి ఘర్షణలు జరుగుతుంటాయని, అయితే ప్రోటోకాల్ ప్రకారం వాటిని పరిష్కరించుకుంటారని సైనిక వర్గాలు తెలిపాయి. 2017 ఆగస్టు లో కూడా ఇలాంటి ఘర్షణలు జరిగాయి.  నాడు లడఖ్ లో పాంగాంగ్ సరస్సు వద్ద భారత, చైనా సైనికులు పిడిగుద్దులు కురిపించుకున్నారు.  ఇక డోక్లాం పీఠభూమి సమస్య ఇరు దేశాల మధ్య ఇంకా నలుగుతూనే ఉంది. 2018 లో వూహాన్ సిటీలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని  నిర్ణయించుకున్నారు. అయితే లడఖ్, డోక్లాం సమస్యలు ఎటూ పరిష్కారం కాకుండా ఉన్నాయి.