వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్.. తన స్వరం మార్చాడు. అసలు ఉగ్రవాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటించాడు. ఆయన చేసిన ప్రసంగాలతో పలువురు యువకులు ఉగ్రవాదానికి ఆకర్షితులైయ్యారంటూ ఎన్ఐఏ ఆయనపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అప్పటి నుంచి దేశం విడిచి మలేసియాలో దాక్కున్నాడు. అయితే అక్కడ కూడా జకీర్ చేసిన ప్రసంగాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది.
ఎన్ఐఏ తనపై మూడేళ్ల పాటు విచారణ చేపట్టిందని.. కానీ చివరకు ఎన్ఐఏకు వాదనకు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా వారి దగ్గర లేదంటూ జకీర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన 127 మంది అనుమానితుల్లో.. ఎక్కువ మంది ఐఎస్ సానుభూతిపరులేనని ఎన్ఐఏ పేర్కొంటుంది. వీరంతా మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలకు ఆకర్షితులైన వారేనంటూ ఎన్ఐఏ తేల్చి చెప్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 28 కేసుల్లో 127 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో తమిళనాడు నుంచి 33 మంది, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 19, కేరళ 17, తెలంగాణలో 14, మహారాష్ట్రలో 12, కర్ణాటకలో 8, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్‌లో ఒకరు, వెస్ట్ బెంగాల్ ఒకరు, జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ఉన్నారని ఎన్ఐఏ లెక్కలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే జకీర్ నాయక్‌పైన, ఆయన సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎస్)పైన ఎన్ఐఏ పలు కేసులు నమోదు చేసింది. అయితే అప్పటి నుంచి జకీర్ నాయక్ విదేశాలకు పారిపోయారు. మలేసియాలో నివాసం ఏర్పరచుకోవడంతో ఇప్పటి వరకు ఆయనను ఈ కేసులో ఎన్ఐఏ విచారించలేకపోయింది. ఆయనను తమకు అప్పగించాలంటూ ఎన్ఐఏ ఇప్పటికే మలేసియా ప్రభుత్వాన్ని కోరింది.