తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. తాజా రాజకీయాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను చెరిసగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుండి నడుస్తున్నందున హైదరాబాద్లో తమకు కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి.ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తున్నది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం గవర్నర్ ను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరింది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ కేబినెట్ కోరిన విధంగానే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.