Former Minister Ganta Srinivas Rao shocks AP BJP leaders: తెలుగుదేశం పార్టీని వీడతారంటూ తెగ ప్రచారం జరిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు.. సోమవారం బీజేపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. తెలుగుదేశంపార్టీకి అంటీముట్టనట్లుంటున్న గంటా శ్రీనివాస్.. అయితే బీజేపీలో లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లో వుంటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరితోను.. విశాఖ, అమరావతిలో వుంటే రాష్ట్ర మంత్రులు కొడాలి నాని తదితరులతోను మాటలు కలుపుతూ వుంటారని కథనాలొచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఆయన మౌనంగా వుంటూ వచ్చారు.
తాజాగా సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో గంటా బీజేపీకి షాకిచ్చారు. తమ పార్టీలో చేరతారని అనుకున్న బీజేపీ నేతలు గంటా శ్రీనివాస్ తాజాగా ఆ పార్టీ క్యాడర్‌కు వలేసి… టీడీపీలోకి లాగేసుకోవడంతో బీజేపీ నేతలు ఖిన్నులైపోయారు. విశాఖ పట్నంలోని టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి గంటా సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పచ్చకండువా కప్పి మరీ ఆహ్వానించారు గంటా శ్రీనివాస్ రావు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. 300 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ నుంచి టీడీపీలోకి చేరడం మార్పుకు నాంది అని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో లక్ష కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణి చేయడం ఒక చరిత్ర అని అన్నారాయన. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నా విశాఖలో చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసే నాలుగు స్థానాల్లో ప్రజలు టీడీపీని గెలిపించారని వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 19వ తేది నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నామని, స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని గంటా పిలుపునిచ్చారు. త్వరలో టీడీపీలోకి మరిన్ని చేరికలుంటాయని గంటా చెప్పుకొచ్చారు.