అమరావతి: పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు మోదీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్. ప్రశ్నిస్తే తప్పేంటని, దేశంపై జరిగిన దాడిని ప్రశ్నిస్తే దేశద్రోహి ఎలా అవుతారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగిందని, అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్ రాజీనామాకు ఆయన డిమాండ్ చేయలేదా? అని గుర్తు చేశారు. పుల్వామా దాడి మధ్యాహ్నం 3:10కి జరిగితే యాడ్ షూటింగ్‌లో మోదీ సాయంత్రం 6:30గంటల వరకు పాల్గోలేదా? అని ప్రశ్నించారు. దాడి విషయం తెలిసే షూటింగ్‌లో పాల్గొన్నారా లేక మూడున్నర గంటల పాటు ప్రధానికి దాడి విషయం తెలియదని అనుకోవాలా? అని మండిపడ్డారు. దాడి ఘటన ఎప్పుడు తెలిసిందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు మోదీ ప్రైమ్ టైమ్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం భాజపా నేతలు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.