#Covid threat అలా వ్యాప్తి జరిగితే తట్టుకోలేం… టేక్ కేర్ అంటున్న ఈటల

|

Apr 06, 2020 | 3:16 PM

కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. ఏ రంగాన్ని వదలకుండా.. ఏ దేశాన్ని వదలకుండా.. ఏ జాతిని, ఏ మతాన్ని వదలకుండా.. అతలాకుతలం చేసేస్తోంది కరోనా వైరస్. కోవిడ్-19గా మనం పిలుచుకుంటున్న కరోనా వైరస్‌ని మనం కట్టడి చేయగలమా?

#Covid threat అలా వ్యాప్తి జరిగితే తట్టుకోలేం... టేక్ కేర్ అంటున్న ఈటల
Follow us on

Etala Rajendar warns of Corona spread: కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. ఏ రంగాన్ని వదలకుండా.. ఏ దేశాన్ని వదలకుండా.. ఏ జాతిని, ఏ మతాన్ని వదలకుండా.. అతలాకుతలం చేసేస్తోంది కరోనా వైరస్. కోవిడ్-19గా మనం పిలుచుకుంటున్న కరోనా వైరస్‌ని మనం కట్టడి చేయగలమా? లేక లాక్ డౌన్ తర్వాత పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న ప్రజలందరినీ వేధిస్తోంది. అలాగని పాలకులు నిశ్చింతగా వున్నారని అనుకోవడానికి లేదు. రేయింబవళ్ళు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్రాలు.. పైకి ఎంత డాంబికంగా ప్రకటనలు చేస్తున్నా.. కరోనా నియంత్రణపై ఏ మూలనో అనుమానంగానే వున్నారు. ఇందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

నిజానికి గత వారం కరోనాని నియంత్రించగలమన్న నమ్మకం కుదురుతున్న తరుణంలోనే తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చి… గోప్యంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన వారితో భయాందోళన ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనా భయం వల్లనో మరే ఇతర కారణం వల్లనో జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారు రహస్యంగా వుండిపోవడంతో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపించి చివరికి ఒక్కసారిగా బరస్ట్ అయ్యింది. ఆ తర్వాత పాలక వర్గాల్లోను, వైద్య వర్గాల్లోను, ఎంతో కొంత సామాజిక స్పృహ వున్నవారిలోను భయం మొదలైంది.

అసలు కరోనా కట్టడి సాధ్యమా అని అడిగితే సూటిగా ఎవరూ స్పందించలేని పరిస్థితికి జమాత్ సభ్యులు కారణమయ్యారు. దానికి తోడు లాక్ డౌన్ ఆంక్షలను బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో జనం రోడ్డెక్కుతుండడం కూడా భయాందోళనను పెంచుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ చాలా ముఖ్యమైన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న దశలో కరోనాను నియంత్రించగలగితే గండం నుంచి బయటపడ్డట్టేనని ఆయనంటున్నారు. కరోనా వ్యాప్తి కమ్యూనిటీ వ్యాప్తి దిశగా మళ్ళితే మాత్రం దాని వ్యాప్తిని నియంత్రించడం కష్టమేనని, అలా వ్యాప్తి మొదలైతే తట్టుకోలేమని ఈటల అభిప్రాయపడ్డారు. సోమవారం కరోనా నియంత్రణా చర్యలను సమీక్షించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 334 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. ఆదివారం ఒక్క రోజే కొత్తగా 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్‌ సోకి మరణించారని తెలిపారు. 33 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారని, ఒక్క హైదరాబాద్‌లోనే కరోనా కేసులు 156కు చేరుకున్నాయని ఆయన చెప్పారు.

తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ జరగలేదని, అలాంటి వ్యాప్తి మొదలైతే తట్టుకోలేమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చినవారివి, వారిని కలిసినవాళ్లవి మాత్రమేనని చెప్పారు. మార్కజ్‌ నుంచి వచ్చిన 1090 మందిని గుర్తించిన అధికారులు వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, అన్ని క్వారంటైన్‌లలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని ఈటల తెలిపారు.

ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినా ట్రీట్ ‌మెంట్ చేయగలిగే స్థాయిలో తెలంగాణలో ఏర్పాట్లు చేశామని, అయితే కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ కాకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ఈటల రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు మరింత లాక్ డౌన్ సమయంలో మరింత క్రమశిక్షణ పాటించాలని మంత్రి సూచించారు.