రాహుల్‌కే మళ్ళీ పగ్గాలు..ముహూర్తం వచ్చేనెలలోనే!

| Edited By: Srinu

Dec 07, 2019 | 5:52 PM

కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం తప్ప మరో దిక్కే లేదని మరోసారి నిరూపణ అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీకే మరోసారి పార్టీ పగ్గాలిచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్దమవుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ అనారోగ్యం దృష్ట్యా మరోసారి రాహుల్ గాంధీకే పార్టీ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. పార్టీ సారథ్య బాధ్యతలను ఊరించి ఊరించి అందుకున్న రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం […]

రాహుల్‌కే మళ్ళీ పగ్గాలు..ముహూర్తం వచ్చేనెలలోనే!
Follow us on

కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం తప్ప మరో దిక్కే లేదని మరోసారి నిరూపణ అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీకే మరోసారి పార్టీ పగ్గాలిచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్దమవుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ అనారోగ్యం దృష్ట్యా మరోసారి రాహుల్ గాంధీకే పార్టీ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు.

పార్టీ సారథ్య బాధ్యతలను ఊరించి ఊరించి అందుకున్న రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడంతో లోక్‌సభ ఎన్నికల్లోను అదే రకమైన ఫలితాలు వస్తాయని భావించి, రాహుల్ గాంధీ దూకుడు ప్రదర్శించారు. రాఫెల్ ఒప్పందాన్ని ఆసరాగా తీసుకుని నరేంద్ర మోదీపై అవినీతి అరోపణలు చేశారు. అయితే, ఆ క్యాంపెయిన్ ‌కాస్తా బూమరాంగ్ అయి, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేసింది.

2014 లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే 2019 ఎన్నికల్లోను పునరావృతమయ్యాయి. దాంతో ఖంగుతిన్న రాహుల్ గాంధీ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎవ్వరు కన్విన్స్ చేసినా కూడా ఆయన మెత్తబడలేదు. దాంతో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ చేపట్టారు. ఇదంతా జరిగి, 3 నెలలు కావస్తుండగా.. తాజాగా మరోసారి రాహుల్ గాంధీకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టేందుకు రంగం సిద్దమవుతోంది.

ఇటీవల పార్టీ సీనియర్లతో భేటీ అయిన సోనియా కొత్త అధ్యక్షుని ఎంపిక చేసుకోవాలని ప్రతిపాదించగా.. సీనియర్లంతా ముక్తకంఠంతో రాహుల్ గాంధీ పేరునే ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు 2017తో పోలిస్తే.. బిజెపి హవా దేశంలో తగ్గుతూ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు అంఛనా వేస్తున్నారు. 2017లో దేశంలో 70 శాతం బిజెపి పాలిత ప్రాంతాలుగా వుండగా.. 2019 నవంబర్ ఆఖరు నాటికి బిజెపి పాలిత ప్రాంతం 40 శాతానికి తగ్గింది. ప్రధానమైన రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు బిజెపి నుంచి చేజారిపోయాయి.

బిజెపి ప్రభావం, మోదీ చరిష్మా తగ్గుతుందని అంఛనా వేస్తున్న కాంగ్రెస్ నేతలు మరోసారి రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించడం ద్వారా 2024 ఎన్నికల కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని భావిస్తున్నారు. సీనియర్ల అభిప్రాయంతో దాదాపు ఏకీభవించిన సోనియా గాంధీ.. తనయుడు రాహుల్‌ని కన్విన్స్ చేసే బాధ్యతలను స్వయంగా తీసుకున్నారని.. అందులో భాగంగా జనవరి రెండోవారంలో కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ బాధ్యతలు చేపడతారని హస్తిన వర్గాలంటున్నాయి.