
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక పోతుంది. దీంతో కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై కేంద్రం ఆరా తీసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో కేంద్ర బృందం భేటీ అయింది.
నగరంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతుండటంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసేందుకు కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యింది. బృందం సభ్యులు వికాస్ గాడే, డా.రవీందర్‌లతో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీ.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ బి.సంతోష్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, కోవిడ్-19 కంట్రోల్ రూం ఓఎస్‌డీ అనురాధ సమావేశమయ్యారు.
గ్రేటర్ పరిధిలో ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులను కేంద్ర బృందం హెచ్చరించింది. ట్రీట్‌మెంట్, కట్టడి జోన్లలో చర్యలపై పూర్తి స్థాయిలో ఆరా తీసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. ప్రైవేట్ పరీక్షల్లో 70 శాతం పాజిటివ్ కేసులుగా వస్తున్నాయని, కరోనా కట్టడికి హోం కంటైన్మెంట్ ఒక్కటే మార్గమని సంజయ్ జాజు స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజల సహకారం చాలా కీలకమని అన్నారు. ప్రజలందరూ కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించకుండా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.