సముద్రంలో బోటు గల్లంతు

|

Oct 15, 2020 | 3:43 PM

సముద్రంలో బోటు గల్లంతైంది. బంగాళాఖాతంలో మత్స్యకారుల బోటు తప్పిపోయింది. వాయుగుండం సమయంలో సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్న బోటు గల్లంతవడంతో మత్స్యకారులు ఘొల్లుమంటున్నారు.

సముద్రంలో బోటు గల్లంతు
Follow us on

Boat missing in the sea: కాకినాడ సమీపంలో సముద్రంలో ఓ బోటు గల్లంతైంది. అందులో ఏడుగురు మత్స్యకారులున్నట్లు సమాచారం. తమ వారి ఆచూకీ తెలియక మత్స్యకారుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. బోటును గాలించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

కాకినాడ దుమ్ములపేటకు చెందిన మత్స్యకార బోటులో ఏడుగురు మత్స్యకారులు అక్టోబర్ 7వ తేదీన బంగాళాఖాతంలో చేపట వేటకు వెళ్ళారు. వారు వెళ్ళి రెండ్రోజుల తర్వాత సముద్రంలో వాయుగుండం ఏర్పడింది. ఆ తర్వాత వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి అక్టోబర్ 13న మధ్యాహ్నం కాకినాడకు సమీపంలో తీరం దాటింది. అయితే వాయుగుండం ప్రభావం ఎక్కువగా వున్న సమయంలో దుమ్ములపేట బోటు గల్లంతైనట్లు మత్స్యకారులు చెబుతున్నారు. గల్లంతైన బోటులో దుమ్ములపేటకు చెందిన పేర్ల రాంబాబు, దుర్గ, పొలయ్య, తాతారావు, సింగరాజు, యల్లజీ వున్నారు.

ఏడవ తేదీన వేటకు వెళ్ళిన బోటు ఆ తర్వాత సముద్రంలో వాయుగుండం కారణం ఏర్పడిన అల్లకల్లోలంతో గల్లంతైనట్లు భావిస్తున్నారు. ఈ బోటు సముద్రంలో మునిగిపోయిందేమో అన్న ఆందోళన మత్స్యకారుల కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. అయితే.. బోటును వెతికే పనిని ప్రారంభించిన అధికార యంత్రాంగం చుట్టు పక్కల జిల్లాలకు సమాచారం అందించింది.

అయితే, సముద్రంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో బోటు ఆగిపోవడంతో చిక్కుకుపోయినట్లు మత్స్యకారులు టీవీ9కు సమాచారం అందించారు. బోటు ఇంజిన్ చెడిపోవడంతో చిక్కుకుపోయామని, తమకు సాయం చేసే వారు కనుచూపు మేరలో కనిపించడం లేదని వారు తెలిపారు. తినేందుకు ఏమీ లేక అలమటిస్తున్నామని, తమను ఆదుకోవాలని వారు టీవీ9కు పంపిన మెసేజ్‌లో పేర్కొన్నారు.

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే! 

Also read: కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు